Rahul Gandhi: సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యల కలకలం.. మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీలో ముసలం

Sanjay Raut warns of rift in MVA over Rahul Gandhi remarks on Savarkar

  • సావర్కర్ బ్రిటిషర్లకు భయపడి క్షమాభిక్ష పిటిషన్లు రాశారన్న రాహుల్
  • రాహుల్ వ్యాఖ్యలతో తమ భాగస్వామ్యం ప్రమాదంలో పడిందన్న సంజయ్ రౌత్
  • రాహుల్‌కు మహాత్మాగాంధీ మునిమనవడి అండ

స్వాతంత్ర్య సమరయోధుడు, హిందూత్వ సిద్ధాంతకర్త వీర సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో కలకలానికి కారణమయ్యాయి. భారత్ జోడో యాత్రలో భాగంగా గురువారం మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో రాహుల్ మాట్లాడుతూ.. సావర్కర్ బ్రిటిషర్లకు భయపడి, వారికి క్షమాభిక్ష పిటిషన్లు రాసి, పింఛను తీసుకున్నారని వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలు ఎంవీఏలో భాగస్వామి అయిన ఉద్ధవ్ శివసేనకు ఆగ్రహం తెప్పించాయి. రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌తో తమ భాగస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ అన్నారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు శివసేనకు ఆమోదయోగ్యం కాదని అన్నారు.

దీనికి స్పందించిన కాంగ్రెస్ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. సావర్కర్‌ను రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకోలేదని, ఓ చారిత్రక వాస్తవాన్ని మాత్రమే ఎత్తి చూపారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వివరణ ఇచ్చారు. రాహుల్ వ్యాఖ్యలు మహారాష్ట్రలోని తమ కూటమిపై ఎలాంటి ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. 

మరోవైపు, భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచిన మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ మాట్లాడుతూ.. సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిజమేనంటూ రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. కాగా, సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ సావర్కర్ జన్మస్థలమైన నాసిక్‌లో భాగూర్ వాసులు నిన్న బంద్ పాటించారు.

  • Loading...

More Telugu News