Twitter: రండి ట్విట్టర్ కు పోటీ ఇద్దాం.. : ట్విట్టర్ మాజీ ఉద్యోగులకు ‘కూ’ పిలుపు
- ట్వట్టర్ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్వీట్
- ‘కూ’ను విస్తరిస్తున్నట్టు ప్రకటన
- ట్విట్టర్ మాజీ ఉద్యోగులను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడి
ట్విట్టర్ మాదిరి సేవలు అందించే దేశీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘కూ’.. ఇప్పుడు ట్విట్టర్ నుంచి తొలగించబడిన ఉద్యోగులకు ఆహ్వానం పలికింది. ప్రపంచ సంపన్నుడైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత.. ఉద్యోగుల పాలిట యముడిలా మారిపోవడం తెలిసిందే. అద్భుతంగా పనిచేయాలి.. రోజులో 18 గంటలు పనిచేయాలి.. అలా అయితేనే ఉండండంటూ మస్క్ తేల్చి చెబుతున్నారు. అంతకుముందు సగం మంది ఉద్యోగులను ఆయన పీకి పారేశాడు. ముఖ్యంగా భారత్ లో అయితే 90 శాతం మంది ఉద్యోగులను తొలగించాడు.
ఈ పరిస్థితిని ట్విట్టర్ పోటీ సంస్థ కూ తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది. మరింత ప్రచారానికి చర్యలు తీసుకుంటోంది. ట్విట్టర్ లో ఎక్కువ మంది ఉద్యోగులు వెళ్లిపోవడంతో ప్లాట్ ఫామ్ నిదానించింది. దీంతో అక్కడి యూజర్లను కూ ఆకర్షించే చర్యలు మొదలు పెట్టింది. కొత్త ఫీచర్లను ప్రకటిస్తోంది. కూ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్క మాట్లాడుతూ.. నిపుణుల కోసం తాము అన్వేషిస్తున్నామని, ముఖ్యంగా ఇటీవల మస్క్ తొలగించిన వారిని ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు.
బిదవత్క ఏకంగా ట్విట్టర్ వేదికపైనే నియామకాల గురించి ప్రకటన చేయడం విశేషం. ‘రెస్ట్ఇన్ పీస్ ట్విట్టర్ చూడ్డానికి బాధగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను నియమించుకుంటామని, తమ ప్లాట్ ఫామ్ ను విస్తరిస్తున్నామని ప్రకటించారు. త్వరలో అమెరికాలోనూ కూ ను విడుదల చేస్తామని సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ట ప్రకటించడం గమనార్హం.