Jagga Reddy: పార్టీని నడిపే పద్ధతిదేనా..?.. టీపీసీసీ తీరుపై జగ్గారెడ్డి ఫైర్
- నేరుగా సమావేశం పెట్టే తీరిక లేదా? అని నిలదీసిన జగ్గారెడ్డి
- జూమ్ మీటింగ్ లతో ఉపయోగమేంటని మండిపాటు
- ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తాజాగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. పార్టీ నడిపే తీరు ఇదికాదని మండిపడ్డారు. రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు శనివారం సాయంత్రం జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడాన్ని జగ్గారెడ్డి తప్పుబట్టారు. పార్టీ భవిష్యత్ పై చర్చించేందుకు నేరుగా భేటీ అయ్యేందుకు కూడా సమయం లేదా? అని రాష్ట్ర ముఖ్య నేతలను నిలదీశారు. జూమ్ మీటింగ్ లతో ఉపయోగం ఏముంటుందని విమర్శించారు.
ఈమేరకు జూమ్ మీటింగ్ లో పాల్గొనాలంటూ ఫోన్ చేసిన పార్టీ నేత ఒకరితో జగ్గారెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. సదరు నేతతో మాట్లాడుతూ.. రాహుల్ పాదయాత్రతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై సమీక్ష చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? అంటూ పార్టీ రాష్ట్ర నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఓవైపు అధికార టీఆర్ఎస్, బీజేపీలు దూకుడుగా వ్యవహరిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ నేతలేమో జూమ్ మీటింగ్ లతో ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.