Dhanraj Nathwani: అమిత్ షా స్థానంలో గుజరాత్ క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడిగా ధన్ రాజ్ నత్వానీ
- జీసీఏ అధ్యక్షుడిగా ధన్ రాజ్ ఏకగ్రీవం
- గతంలో జీసీఏ అధ్యక్షుడిగా అమిత్ షా
- అంతకుముందు ఇదే పదవిని చేపట్టిన నరేంద్ర మోదీ
- ధన్ రాజ్ ఏపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ కుమారుడు
గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) నూతన అధ్యక్షుడిగా ధన్ రాజ్ పరిమళ్ నత్వానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు బీసీసీఐ కార్యదర్శి జై షా శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక, ఎన్నికలు జరపడం ఇదే ప్రథమం.
అమిత్ షా స్థానంలో జీసీఏ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోబోతున్న ధన్ రాజ్ నత్వానీ ఇప్పటివరకు జీసీఏ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. తాజా కార్యవర్గంలో జీసీఏ ఉపాధ్యక్షుడిగా హేమంత్ భాయ్ కాంట్రాక్టర్, కార్యదర్శిగా అనిల్ భాయ్ పటేల్, సంయుక్త కార్యదర్శిగా మయూర్ భాయ్ పటేల్, కోశాధికారిగా భరత్ జవేరీ బాధ్యతలు చేపట్టనున్నారు.
కాగా, గుజరాత్ క్రికెట్ సంఘానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా గతంలో అధ్యక్షుడిగా పనిచేయడం విశేషం. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో 2009లో జీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన తర్వాత 2014లో జీసీఏ అధ్యక్షుడిగా అమిత్ షా పదవిని చేపట్టారు. ఇప్పుడు అమిత్ షా స్థానంలో ధన్ రాజ్ పరిమళ్ నత్వానీ నూతన అధ్యక్షుడు అయ్యారు.
ధన్ రాజ్ ఎవరో కాదు... ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్లిన పరిమళ్ నత్వానీ కుమారుడే. పరిమళ్ నత్వానీ కూడా గుజరాత్ క్రికెట్ సంఘంలో పదవిని చేపట్టారు.