Army: మా పెళ్లికి రండి! భారత సైన్యానికి కేరళ జంట ఆహ్వానం
- మీ దేశభక్తి వల్లే మేమిక్కడ సంతోషంగా ఉన్నామని వెల్లడి
- సైనికుల త్యాగాలకు రుణపడిపోయామంటూ లేఖ
- పెళ్లి పత్రికను పోస్టులో పంపిన రాహుల్, కార్తీక
- సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు ఆర్మీ శుభాకాంక్షలు
‘మీ ధైర్యసాహసాల వల్లే మేమిక్కడ సంతోషంగా జీవిస్తున్నాం.. ఇప్పుడు ఒక్కటవబోతున్నాం.. ఇలాంటి ఆనంద సమయంలో మీరు మా చెంత ఉండాలి’ అంటూ కేరళకు చెందిన ఓ యువజంట భారత సైన్యానికి పెండ్లి పత్రిక పంపించింది. ఆ కార్డు అందుకున్న ఆర్మీ అధికారులు కూడా అంతే సంతోషంగా జవాబిచ్చారు. కలకాలం కలిసి ఉండాలంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లికి పిలిచినందుకు ధన్యవాదాలు చెబుతూ సదరు పెండ్లి పత్రికను ఆర్మీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.
కేరళకు చెందిన రాహుల్, కార్తీకలు ఈ నెల 10న వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఆ జంట ఆర్మీని ఆహ్వానించింది. తమ పెండ్లి పత్రికను ఆర్మీకి పంపించింది. ‘ప్రియమైన హీరోలకు..’ అంటూ సైనికులను సంబోధిస్తూ.. మీ ప్రేమ, దేశంపై మీకున్న భక్తి, విధినిర్వహణలో మీరు చూపించే సాహసానికి మేమెంతో రుణపడి పోయామని రాహుల్, కార్తీక పేర్కొన్నారు. ‘సరిహద్దుల్లో కాపలా కాస్తూ మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతున్నందుకు, మా జీవితాలను సంతోషంగా ఉంచుతున్నందుకు మీకు ధన్యవాదాలు. మా పెళ్లికి హాజరై మమ్మల్ని దీవించండి’ అంటూ ఆహ్వానించారు.
రాహుల్, కార్తీకల ఆహ్వానంపై ఆర్మీ అధికారులు స్పందించారు. పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. పెళ్లికి పిలిచినందుకు ధన్యవాదాలు. భారత సైన్యం మీ జంటకు ఆశీస్సులు అందజేస్తోంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తోందని ఆర్మీ అధికారులు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కాస్తా ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు నేను చూసిన బెస్ట్ పెళ్లిపిలుపు ఇదేనంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.