Telangana: వణుకుతున్న తెలంగాణ.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Temperatures Dipping Telangana

  • 2017 తర్వాత నవంబరులో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు
  • సిర్పూరు (యు)లో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందంటున్న అధికారులు

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణుకుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న తెల్లవారుజామున కుమురం భీం జిల్లా సిర్పూరు (యు)లో అత్యల్పంగా 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10, హైదరాబాద్ శివారు నందనవనంలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ఈ సీజన్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతకుముందు 2017లో ఇదే నెలలో ఆదిలాబాద్‌లో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత నమోదైన అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవే. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

మరోవైపు, పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పడిపోతున్నాయి. నిన్న అత్యల్పంగా భద్రాచలంలో 27, హైదరాబాద్‌లో 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తుండడమే రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడానికి కారణమని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News