Team India: కీలక మ్యాచ్‌కు ముందు జట్టుకు దూరమైన కివీస్ కెప్టెన్ విలియమ్సన్
- సిరీస్ ఫలితాన్ని తేల్చనున్న మూడో టీ20
- ముందస్తు మెడికల్ అపాయింట్‌మెంట్ కారణంగానేనన్న కోచ్
- టిమ్ సౌథీకి సారథ్య బాధ్యతలు
భారత్‌తో నేపియర్‌లో జరగనున్న కీలకమైన చివరి టీ20కి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. విలియమ్సన్ స్థానంలో టిమ్ సౌథీ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న మౌంట్ మాంగనూయిలో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ 52 బంతుల్లో 61 పరుగులు చేశాడు.
కాగా, ముందస్తు మెడికల్ అపాయింట్‌మెంట్ కారణంగానే విలియమ్సన్ మంగళవారం నాటి ఆఖరి గేమ్‌కు దూరమవుతున్నట్టు కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. ఆటగాళ్లు, సిబ్బంది ఆరోగ్యం తమకు చాలా ముఖ్యమైనదని అన్నాడు. వన్డేలకు అతడు అందుబాటులో ఉంటాడని అన్నాడు. అయితే, కేన్‌ను తరచూ ఇబ్బంది పెడుతున్న మోచేతి గాయానికి, ఈ అపాయింట్‌మెంట్‌కు సంబంధం లేదని గ్యారీ స్టెడ్ స్పష్టం చేశాడు.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రేపు (మంగళవారం) జరగనున్న చివరి మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. ఈ సిరీస్ తర్వాత ఈ నెల 25 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. 25న ఆక్లాండ్‌లో తొలి వన్డే జరగనుండగా, 27న హమిల్టన్‌లో రెండో వన్డే, క్రైస్ట్‌చర్చ్‌లో 30న చివరి వన్డే జరుగుతాయి.