wasim akram: ఇప్పటికీ నన్నొక మ్యాచ్ ఫిక్సర్ గానే చూస్తారు: వసీం అక్రమ్
- పాక్ సోషల్ మీడియా జనరేషన్ కు తనపై చిన్నచూపే ఉందన్న వసీం
- ఇలాంటి ఆరోపణలను పట్టించుకునే దశను దాటేశానని వ్యాఖ్య
- భారతీయులు మాత్రం నన్నొక బెస్ట్ బౌలర్ గా గుర్తుపెట్టుకున్నారని వెల్లడి
పాకిస్థాన్ లో కొంతమంది తనను ఇప్పటికీ మ్యాచ్ ఫిక్సర్ గానే చూస్తారని ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా సోషల్ మీడియా జనరేషన్ తనను మ్యాచ్ ఫిక్సర్ గానే గుర్తుపెట్టుకుందని చెప్పాడు. బౌలర్ గా, ఆల్ రౌండర్ గా, కెప్టెన్ గా పాక్ జట్టుకు సేవలందించిన వసీం అక్రమ్.. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే, తన గురించి జనం ఏమనుకుంటున్నారో అని బాధపడే దశను దాటేసినట్లు అక్రమ్ వివరించాడు. భారతీయులు మాత్రం తనను బెస్ట్ బౌలర్ గా గుర్తుపెట్టుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపాడు.
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్ లలో అత్యుత్తమ క్రికెటర్ల గురించి చర్చ జరిగితే మంచి ఫేస్ బౌలర్ గా తన పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుందని వసీం అక్రమ్ చెప్పాడు. పాకిస్థాన్ లో మాత్రం తన పేరు ప్రస్తావనకు వస్తే.. ‘అతనొక మ్యాచ్ ఫిక్సర్’ అని కొట్టిపడేస్తారని వివరించాడు. తనపై వచ్చిన ఆరోపణలలో నిజానిజాలను తరచి చూసే ఓపిక, సమయం వారికి లేదని వసీం అక్రమ్ చెప్పాడు. అయితే, తన గురించి ప్రజలు చేసే ఆరోపణలు, విమర్శల గురించి పట్టించుకోబోనని ఆయన తేల్చిచెప్పాడు. కాగా, 1996 లో క్రైస్ట్ చర్చ్ లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు వసీం అక్రమ్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి.