UPI payment: ఇంటర్నెట్ లేకుండా యూపీఐతో నగదు బదిలీ
- ఆఫ్ లైన్ యూపీఐ చెల్లింపుల విధానం
- బ్యాంకులో నమోదైన మొబైల్ నంబర్ ఉంటే చాలు
- స్టార్ 99 హ్యాష్ టైప్ చేయడం ద్వారా బ్యాంకు సేవలు
ఒకప్పుడు జేబులో నోటు ఉండాలి. కానీ, నేడు జేబులో ఫోన్ ఉంటే చాలు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటి యాప్స్ తో ఎక్కడైనా సరే యూపీఐ పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అంతేకాదు. ఈ యాప్ ల సాయంతో త్వరలోనే ఏటీఎంల నుంచి నగదును కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. అంతటి కీలకమైన యూపీఐ యాప్స్ కు మొబైల్ ఫోన్ లో నెట్ ఉండడం ఎంతో అవసరం. లేదంటే లావాదేవీలకు అవాంతరం ఏర్పడుతుంది. నెట్ వర్క్ సమస్యలు ఏర్పడినా ఇంతే. అసలు నెట్ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్ చేసే వెసులుబాటు ఉందని తెలుసా? దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అందిస్తోంది.
ఆఫ్ లైన్ యూపీఐ విధానం కూడా ఒకటి ఉంది. మన మొబైల్ ఫోన్ డయల్ ప్యాడ్ పై యూఎస్ఎస్ డీ కోడ్ అయిన.. స్టార్ 99 హ్యాష్ టైప్ చేయాలి. అప్పుడు ఫోన్ పై మెనూ ఓపెన్ అవుతుంది. బ్యాంకులో నమోదైన మొబైల్ నంబర్ పైనే దీన్ని డయల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు తెరుచుకునే మెనూలో.. కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ‘సెండ్ మనీ’, ‘రిక్వెస్ట్ మనీ’, ‘చెక్ బ్యాలన్స్’, ‘మై ప్రొఫైల్’, ‘పెండింగ్ రిక్వెస్ట్’, ‘ట్రాన్సాక్షన్స్’, ‘యూపీఐ పిన్’ కనిపిస్తాయి. నగదు పంపాలనుకుంటే సెండ్ మనీ ఆప్షన్ ముందున్న నంబర్ ను టైప్ చేసి సెండ్ చేయాలి.
అప్పుడు ఏ ఖాతాకు నగదు పంపించాలని అడుగుతుంది. అప్పుడు నగదు స్వీకరించాల్సిన వ్యక్తి మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ఇవ్వాలి. తర్వాత నగదు ఎంతన్నది టైప్ చేయాలి. ట్రాన్సాక్షన్ రిమార్క్ కావాలంటే నమోదు చేయవచ్చు. ఆ తర్వాత యూపీఐ పిన్ టైప్ చేస్తే లావాదేవీ ప్రాసెస్ అవుతుంది.