AAP: ఆప్ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టిన కార్యకర్తలు.. వీడియో ఇదిగో!

AAP MLA Gulab Singh Yadav Beaten Up In Delhi

  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఆప్ పై విమర్శలు గుప్పించిన బీజేపీ నేతలు
  • ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ టికెట్లు అమ్మకానికి పెట్టారని ఆరోపణలు
  • ఆ పార్టీలో అవినీతిని కార్యకర్తలు కూడా భరించలేకపోతున్నారన్న సంబిత్ పాత్రా

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై సోమవారం దాడి జరిగింది. ఆ పార్టీ కార్యకర్తలే ఆయనపై దాడి చేసి, పిడిగుద్దులు కురిపించారు. తప్పించుకుని పారిపోతుంటే వెంటపడి మరీ చెప్పుతో కొట్టారు. దాడి ఎందుకు జరిగిందనే విషయంపై ఆప్ వర్గాల నుంచి స్పష్టత లేదు. అయితే, ఢిల్లీలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆప్ నేతలు పార్టీ టికెట్లను అమ్మకానికి పెట్టారని, అది సహించలేకే మాటియాలా నియోజకవర్గం ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ను కార్యకర్తలు కొట్టారని చెబుతున్నారు.

ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్యామ్ విహార్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఢిల్లీ సివిక్ పోల్స్ లో పార్టీ టికెట్ల పంపకానికి సంబంధించి ఈ మీటింగ్ లో చర్చ జరిగినట్లు సమాచారం. వాడివేడిగా సాగిన ఈ సమావేశం ఓ దశలో అదుపుతప్పింది. ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ను కార్యకర్తలు నిలదీశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు గులాబ్ సింగ్ ప్రయత్నించారు. అయితే, కార్యకర్తలు ఆయనను అడ్డుకుని దాడి చేయడం మొదలు పెట్టారు. ఆయనపై పిడిగుద్దులు కురిపించారు.

పారిపోతున్న గులాబ్ సింగ్ ను ఓ కార్యకర్త గల్లా పట్టుకుని మరీ చెప్పుతో కొట్టడం వీడియోలో కనిపించింది. సదరు కార్యకర్త పట్టునుంచి విడిపించుకుని గులాబ్ సింగ్ పారిపోయారు. కాగా, ఈ దాడిపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించలేదు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఈ వీడియోను ట్విట్టర్లో పెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు. నీతిమంతమైన రాజకీయాలు చేస్తామని చెప్పుకునే పార్టీలో అవినీతిని ఆ పార్టీ కార్యకర్తలే భరించట్లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి జనం ఇలాగే బుద్ధి చెబుతారని సంబిత్ పాత్రా జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News