Vakkantham Vamsi: సుమ - రాజీవ్ లవ్ లో ఉన్నారనే సంగతి అప్పుడు తెలిసింది: వక్కంతం వంశీ
- న్యూస్ రీడర్ గా వక్కంతం వంశీ పరిచయం
- హీరోగా తొలి సినిమా 'కల్యాణ ప్రాప్తిరస్తు'
- రైటర్ గా మారిన వక్కంతం వంశీ
- 'నా పేరు సూర్య' తో డైరెక్టర్ గా ఎంట్రీ
వక్కంతం వంశీకి సినీ రచయితగా మంచి పేరు ఉంది. 'కిక్' .. ' టెంపర్' .. 'రేసుగుర్రం' .. 'క్రాక్' వంటి సినిమాలు ఆయనకి మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న 'ఏజెంట్' కథ కూడా ఆయనదే. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన ఆయన, తన కెరియర్ గురించిన విషయాలను పంచుకున్నాడు.
"నేను పుట్టి పెరిగిందంతా తిరుపతిలోనే. మొదటి నుంచి కూడా నాకు సినిమాల పిచ్చి ఉండేది. కానీ ఎలా సినిమాల్లోకి వెళ్లాలి? అందుకోసం ఏం చేయాలి? అనేది తెలియదు. అలాంటి పరిస్థితుల్లోనే ఈటీవీలో న్యూస్ రీడర్ గా సెలెక్ట్ కావడం జరిగింది . అక్క్కడ ఉంటూ సినిమాల్లో ప్రయత్నాలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో హైదరాబాదు వచ్చేశాను" అన్నాడు.
"దాసరి గారు కల్యాణ ప్రాప్తిరస్తు' సినిమా చేయనున్నట్టు తెలిసి, నేను కూడా హీరో పాత్ర కోసం అప్లై చేశాను. అదృష్టం కొద్దీ ఆ సినిమాలో నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. హీరోయిన్లు సుమ - కావ్య. ఆ సినిమా సమయానికే నాకు రాజీవ్ కనకాల మంచి ఫ్రెండ్. రోజూ షూటింగు పూర్తిచేసి వచ్చిన తరువాత తను సుమ గురించి అడుగుతుండేవాడు. సినిమా గురించి కాకుండా సుమ గురించి అడుగుతున్నాడేంటి? అనుకునేవాడిని. ఆ తరువాత తెలిసింది .. అప్పటికే వాళ్లిద్దరూ లవ్ లో ఉన్నారని" అంటూ నవ్వేశాడు.