- కొత్త సేవను తీసుకొచ్చిన పేటీఎం
- పేటీఎం నుంచి గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పేకు నగదు బదిలీ
- త్వరలో మిగిలిన సంస్థల నుంచి సైతం ఈ ఫీచర్
మీ ఫోన్లో పేటీఎం యాప్ ఒక్కటే ఉందా..? పేటీఎం యాప్ లేకుండా, ఫోన్ పే, గూగుల్ పే మరేదైనా యూపీఐ యాప్ లో నమోదై ఉన్న వ్యక్తికి నగదు పంపించాలని అనుకుంటున్నారా..? ఇక మీదట సాధ్యమే. ఈ సదుపాయాన్ని పేటీఎం తాజాగా ప్రవేశపెట్టింది.
పేటీఎం యూజర్ పేటీఎం యాప్ నుంచి.. యూపీఐ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ దేనికైనా నగదు బదిలీ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఇందుకు అవతలి వారి వద్ద పేటీఎం యాప్ ఉండక్కర్లేదని స్పష్టం చేసింది. ఎక్కువ మంది యూపీఐ చెల్లింపులను వినియోగించుకునేలా ప్రోత్సహించడమే తమ ఉద్దేశ్యమని పేటీఎం తెలిపింది. దేశంలో ఆర్థిక సేవల విస్తృతిని పెంచాలన్న తమ లక్ష్యాన్ని ఇది బలోపేతం చేస్తుందని పేటీఎం పేర్కొంది.
ఇప్పటి వరకు ఒక వ్యక్తి మరో వ్యక్తికి యూపీఐ ద్వారా నగదు పంపాలని అనుకుంటే.. అదే యాప్ లో అవతలి వ్యక్తికి కూడా ఖాతా ఉండాలి. ఇక మీదట ఈ ఇబ్బంది పోయినట్టే. గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే తదితర సంస్థలు సైతం ఈ ఫీచర్ ను ప్రకటించే అవకాశాలున్నాయి.