Marri Shashidhar Reddy: కాంగ్రెస్ కు మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా.. బాధతోనే తప్పుకుంటున్నానని వ్యాఖ్య!
- టీఆర్ఎస్ తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని వ్యాఖ్య
- డబ్బు ఇచ్చే వాళ్ల మాటే కాంగ్రెస్ లో చెల్లుతుందని విమర్శ
- ప్రతిపక్ష పాత్రను పోషించడంలో కూడా కాంగ్రెస్ విఫలమయిందని వ్యాఖ్య
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎంతో బాధతో పార్టీని వీడుతున్నానని ఆయన చెప్పారు. అన్ని వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాశానని తెలిపారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతోందని అన్నారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో కూడా పార్టీ విఫలమయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ప్రతి ఎన్నికలోనూ ఓడిపోతూనే వస్తున్నామని శశిధర్ రెడ్డి అన్నారు. అయినా ఆయనను మార్చకుండా ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగించారని చెప్పారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలుగా వ్యవహరించే వ్యక్తులు హైకమాండ్ కు ప్రతినిధిగా ఉంటూ అందరినీ సమన్వయం చేయాలని.. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేయాలని అన్నారు. కానీ ఇన్ఛార్జీలుగా వచ్చిన వారంతా పీసీసీ అధ్యక్షులకు ఏజెంట్లుగా మారిపోయారని విమర్శించారు. డబ్బు ఇచ్చే వాళ్ల మాటే కాంగ్రెస్ లో చెల్లుతుందని అన్నారు.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మర్రి శశిధర్ రెడ్డి ఇటీవల భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై శశిధర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి శశిధర్ రెడ్డిని బహిష్కరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.