Rain: వర్షం కారణంగా నిలిచిపోయిన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్
- నేడు నేపియర్ లో మూడో టీ20 మ్యాచ్
- 19.4 ఓవర్లలో 160 పరుగులు చేసిన న్యూజిలాండ్
- టీమిండియా బ్యాటింగ్ కు అడ్డుతగిలిన వరుణుడు
న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న టీమిండియాను వరుణుడు వెంటాడుతున్నాడు. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా, రెండో మ్యాచ్ లోనూ కాసింత ఆందోళనకు గురిచేశాడు. ఇవాళ మూడో మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ చేస్తుండగా అడ్డుతగిలాడు.
161 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 9 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసిన దశలో వర్షం పడడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే 66 బంతుల్లో 86 పరుగులు చేయాలి. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (30 బ్యాటింగ్), దీపక్ హుడా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఓపెనర్లు ఇషాన్ కిషన్ 10, రిషబ్ పంత్ 11 పరుగులు చేసి అవుటయ్యారు. వన్ డౌన్ లో వచ్చిన మిస్టర్ 360 కేవలం 13 పరుగుల చేసి నిరాశపరిచాడు. శ్రేయాస్ అయ్యర్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు.
నేపియర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆతిథ్య న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తెలిసిందే. భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది.