Enforcement Directorate: ఈడీ ముందుకు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్
- ఈ ఉదయం ఈడీ కార్యాలయానికి వచ్చిన హైదరాబాద్ నేత
- నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు రావాలని ఆయనకు ఈడీ నోటీసులు
- ఈ కేసులో సోనియా, రాహుల్, ఖర్గేతో పాటు పలువురు తెలంగాణ నేతలను విచారించిన ఈడీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులకు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. ఈ కేసు విచారణలో భాగంగా సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బుధవారం ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో సంబంధిత అధికారుల ముందుకొచ్చారు. యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 ఏ ప్రకారం ఆయనను ఈడీ ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.
గత నెల 3వ తేదీనే అంజన్ కుమార్ యాదవ్ విచారణకు రావాల్సి ఉండగా, అనారోగ్యం కారణంగా ఆయన హాజరు కాలేదు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు.