Ch Malla Reddy: ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు: మల్లారెడ్డి
- నాతో సంతకం చేయించుకుంటామని చెప్పి.. నా కొడుకుతో బలవంతంగా సంతకం చేయించుకున్నారన్న మల్లారెడ్డి
- పేపర్లో ఏముందో కూడా చూడకుండా నా కొడుకు సంతకం పెట్టాడని వెల్లడి
- నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడనే విషయాన్ని కూడా టీవీలో చూసే తెలుసుకున్నామన్న మంత్రి
ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. తన ఇంట్లో సోదాలు పూర్తయిన తర్వాత తనతో, తన చిన్న కుమారుడితో సంతకాలు చేయించుకున్నారని ఆయన తెలిపారు. తన పెద్ద కొడుకుకు సంబంధించి కూడా రిపోర్ట్ తయారు చేశారని, ఆయనతో సంతకం చేయించుకోవడానికి వెళ్తుంటే... ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో ఉన్నారని, తన కొడుకు తరపున కూడా తానే సంతకం పెడతానని చెప్పానని... దానికి ఐటీ అధికారులు అంగీకరించారని చెప్పారు. మీతోనే సంతకం చేయించుకుంటామని అధికారులు చెప్పారని... కానీ మోసం చేశారని అన్నారు. నాన్నతో ఐటీ అధికారులు సంతకం చేయించుకుంటున్నారని ఆసుపత్రి నుంచి తన మనవరాలు తనకు ఫోన్ చేసి చెపితే తాను షాక్ కు గురయ్యానని చెప్పారు.
ఆసుపత్రికి వెళ్లిన ఐటీ అధికారులు అంతా అయిపోయిందని, సంతకం చేయాలని తన కొడుకుపై ఒత్తిడి చేశారని మల్లారెడ్డి తెలిపారు. తన కొడుకు ఆ పేపర్లో ఏముందో కూడా చదవకుండా సంతకం పెట్టేశాడని అన్నారు. ఇంత మోసం చేయాల్సిన అవసరం ఐటీ అధికారులకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
తన కొడుకు ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరాడనే విషయాన్ని కూడా తాము టీవీలో చూసే తెలుసుకున్నామని మల్లారెడ్డి చెప్పారు. ఈ విషయం తెలిసి తన భార్య ఏడ్చేసిందని... తాము ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఐటీ అధికారులు అనుమతించలేదని... ఫోన్ ద్వారా మాట్లాడిస్తామని చెప్పారని తెలిపారు. కానీ, తామే బలవంతంగా ఆసుపత్రికి వచ్చామని చెప్పారు.