bowenpally: మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల ఫిర్యాదు.. కేసు నమోదు
- తమపై దాడి చేశాడంటూ ఐటీ అధికారి ఫిర్యాదు
- బోయిన్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు.. కేసు నమోదు
- ల్యాప్ టాప్, ఫోన్లు లాక్కున్నారని మల్లారెడ్డిపై ఆరోపణలు
- తిరిగిచ్చినా తీసుకోని అధికారులు.. తమది కాదని ప్రకటన
ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి నివాసంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికారులు తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి బుధవారం ఆరోపించగా.. గురువారం తమపైనే మల్లారెడ్డి దాడి చేశారని ఐటీ అధికారులు ప్రతి ఆరోపణలు చేశారు. ఈమేరకు వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
మంత్రి తమపై దాడి చేసి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు గుంజుకున్నారని ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోదాల సందర్భంగా తాము సేకరించిన సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు. ల్యాప్ టాప్ తెచ్చి ఇచ్చినా ఐటీ సిబ్బంది దానిని తీసుకోలేదు. అది తమ ల్యాప్ టాప్ కాదని చెప్పడంతో దానిని పోలీస్ స్టేషన్ లో భద్రపరిచినట్లు సమాచారం. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో మంత్రి మల్లారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మల్లారెడ్డిపై అధికారుల ఆరోపణలు ఇవీ..
* సివిల్ సర్వెంట్ విధులకు ఆటంకం కలిగించడం
* తప్పుడు సమాచారం ఇవ్వడం
* అసభ్యపదజాలంతో దూషించడం
* ల్యాప్‌టాప్, ఫోన్‌లను లాక్కోవడం
* సాక్ష్యాలు, ఆధారాలను ధ్వంసం చేయడం