Indian Railways: కిందటేడాది 177 మంది అధికారులను తొలగించిన రైల్వే
- వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపిన ఉన్నతాధికారులు
- విధుల్లో అలసత్వమే దీనికి కారణమని వివరణ
- అవినీతిని, నిర్లక్ష్యాన్ని సహించబోమన్న రైల్వే మంత్రి
కేంద్ర ప్రభుత్వ సంస్థలో అధికారి హోదాలో ఉన్నానని రిలాక్స్ అయితే కుదరదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన వారిని ఇంటికి పంపించేస్తోంది. గతేడాది ఇదే కారణంతో 177 మందిని రైల్వే తొలగించినట్లు సమాచారం. అయితే, అందులో కొంతమందిని స్వచ్ఛంద పదవీ విరమణ చేసేలా ఒత్తిడి తేవడం, మరికొందరిని నేరుగా సస్పెండ్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ హైదరాబాద్ లో పట్టుబడిన ఇద్దరు ఉన్నతాధికారులను తొలగిస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, మెడికల్, సివిల్ సర్వీస్ శాఖలలో విధులు నిర్వహిస్తున్న 139 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి రైల్వే శాఖ వారిని ఇంటికి పంపించింది. కాగా, కేంద్ర రైల్వే మంత్రిగా 2021లో బాధ్యతలు తీసుకున్న తర్వాత అశ్వినీ వైష్ణవ్ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు. పనిచేయకుండా సంస్థకు భారంగా మారిన ఉద్యోగులను ఇంటికి పంపించేస్తామని చాలా సందర్భాలలో మంత్రి పేర్కొన్నట్లు అధికారులు చెప్పారు.