Hyderabad: బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన హైదరాబాద్ యువ క్రికెటర్
- భారత–ఎ టీమ్‌లో చోటు దక్కించుకున్న ఠాకూర్ తిలక్ వర్మ
- బంగ్లాతో వన్డే సిరీస్‌కు రవీంద్ర జడేజా, దయాల్ దూరం
- వారి స్థానాల్లో కుల్దీప్ సేన్, షాబాజ్ అహ్మద్ కు చోటు
ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ లో సత్తాచాటుతున్న హైదరాబాద్ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ కు అరుదైన అవకాశం లభించింది. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత–ఎ జట్టుకు తిలక్ ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భాగంగా భారత–ఎ జట్టు.. బంగ్లాదేశ్–ఎతో నాలుగు రోజుల పాటు జరిగే రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ నెల 29–డిసెంబర్ 2 మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. డిసెంబర్ 6-9 మధ్య రెండో మ్యాచ్ ను షెడ్యూల్ చేశారు. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలోని ఈ జట్టులో తిలక్ వర్మకు అవకాశం లభించింది. అతనితో పాటు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అండర్–19 ప్రపంచ కప్ హీరో యశ్ ధూల్‌కు కూడా చోటు దక్కింది.
కాగా, బంగ్లాదేశ్–ఎతో రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత సీనియర్ క్రికెటర్లు చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్ తో పాటు ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ పోటీ పడనున్నారు. ఇక, బంగ్లా దేశ్ తో మూడు వన్డేల సిరీస్‌కు సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, యంగ్ పేసర్ యష్ దయాల్ దూరమయ్యారు. ఆసియా కప్ సందర్భంగా అయిన మోకాలి గాయం నుంచి జడేజా ఇంకా కోలుకోలేదు. యష్ దయాల్ వెన్నుగాయానికి గురయ్యాడు.
ఈ ఇద్దరి స్థానాల్లో ఆఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ.. కుల్దీప్ సేన్, షాబాజ్ అహ్మద్‌లను జట్టులోకి తీసుకుంది. కాగా, వచ్చే నెలలో భారత్.. బంగ్లాదేశ్ లో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టుతో పోటీ పడుతుంది. . డిసెంబర్ 4, 7, 10వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. అదే నెల 14–18 మధ్య తొలి టెస్టు, 22–26 మధ్య రెండు టెస్టు మ్యాచ్ లు జరుగుతాయి.