fifa: జర్మనీపై చారిత్రక విజయం తర్వాత జపాన్ ఫుట్ బాల్ జట్టు చేసిన పనికి సలాం కొట్టాల్సిందే!
- నిన్న రాత్రి జర్మనీపై సంచలన విజయం సాధించిన జపాన్
- మ్యాచ్ కు ముందు, తర్వాత స్టేడియాన్ని శుభ్రం చేసిన ఆ దేశ అభిమానులు
- తమకు కేటాయించిన లాకర్ రూమ్స్ ను క్లీన్ చేసి వెళ్లిపోయిన జపాన్ ఆటగాళ్లు
ఖతార్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో సంచలనాల మోత మోగుతూనే ఉంది. పెద్ద జట్లకు చిన్న జట్లు షాకిస్తూనే ఉన్నాయి. అర్జెంటీనాపై అనామక సౌదీ అరేబియా అనూహ్య విజయం సాధించగా.. తాజాగా నాలుగు సార్లు జర్మనీకి జపాన్ జట్టు చెక్ పెట్టింది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో జపాన్ 2–1తో జర్మనీని ఓడించింది. మ్యాచ్ సమయంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లుగా బరిలోకిది దిగిన రిత్సు దోవాన్ (75వ నిమిషంలో), తకుమా అసనో (83వ నిమిషంలో) చెరో గోల్‌తో జపాన్‌కు గొప్ప విజయం అందించారు. ఈ ఇద్దరూ జర్మనీకి చెందిన క్లబ్స్‌కు ఆడుతున్న ఆటగాళ్లు కావడం విశేషం.
ఈ మ్యాచ్ ఫిఫా ప్రపంచ కప్ లో సంచలనం సృష్టించిన జపాన్ ఆటగాళ్లు మ్యాచ్ తర్వాత చేసిన పనితో అభిమానుల మనసులు దోచారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఖలిఫా అంతర్జాతీయ స్టేడియంలో తమకు కేటాయించిన లాకర్ రూమ్స్ (డ్రెస్సింగ్ రూమ్) ను శుభ్రం చేశారు. గది తమకు కేటాయించినప్పుడు ఎంత నీట్ గా వుందో తిరిగి వెళ్లేటప్పుడు దాన్ని అలానే ఉంచారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. జపాన్ లాకర్ రూమ్ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. మ్యాచ్ కు ముందు, తర్వాత జపాన్ అభిమానులు స్టేడియాన్ని శుభ్రం చేస్తే.. ఆ దేశ ఆటగాళ్లు లాకర్ రూమ్ ను శుభ్రం చేసి వెళ్లిన విషయాన్ని తెలిపింది. దాంతో, జపాన్ ఆటగాళ్లు మైదానంలో తమ ఆటతోనే కాకుండా స్వచ్ఛమైన మనసుతోనూ ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో జపాన్ ఆటగాళ్లకు సలాం కొట్టాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.