Kakani Govardhan Reddy: హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం... చంద్రబాబులాగా తప్పించుకోవాలని చూడడంలేదు: మంత్రి కాకాణి
- ఫోర్జరీ, తప్పుడు పత్రాల కేసులో కాకాణి నిందితుడు
- నెల్లూరు కోర్టు నుంచి కీలక ఆధారాలు మాయం
- సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు
- సీబీఐ ఎంక్వైరీ కోరుతూ తానే అఫిడవిట్ దాఖలు చేశానన్న కాకాణి
ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న ఫోర్జరీ, నకిలీ పత్రాల కేసులో నెల్లూరు కోర్టు నుంచి కీలక ఆధారాలు మాయం కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు... కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తున్నట్టు వెల్లడించింది. దీనిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. సీబీఐ విచారణ కోరుతూ తానే అఫిడవిట్ దాఖలు చేశానని వెల్లడించారు. కోర్టు తన విజ్ఞప్తిని మన్నించిందని తెలిపారు. తనపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని, ఇప్పుడు సీబీఐ విచారణతో వాస్తవాలేంటో అందరికీ తెలుస్తాయని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబులాగా తాను విచారణ నుంచి తప్పించుకోవాలని అనుకోవడంలేదని అన్నారు. చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయని, ఆయన లాగా స్టేలు తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం తనకు పట్టలేదన్నారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆరోపణలు వచ్చినా విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కాకాణి అభిప్రాయపడ్డారు.