Assam: సరిహద్దు వివాదం ఎఫెక్ట్.. మేఘాలయలో పెట్రోలు బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాల బారులు!

Huge rush at Meghalaya petrol pumps after Assam transporters stop fuel supply

  • ఇటీవల మేఘాలయ-అసోం సరిహద్దులో కాల్పులు
  • మేఘాలయలో అసోం వాహనాలపై దాడులు
  • మేఘాలయకు పెట్రోలు సరఫరా చేయబోమన్న ఏపీఎంయూ
  • పెట్రోలు కొరత తప్పదంటున్న మేఘాలయ పెట్రోలు బంకు డీలర్లు

అసోం-మేఘాలయ సరిహద్దులో ఇటీవల జరిగిన కాల్పుల ఘటన రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. మంగళవారం జరిగిన కాల్పుల్లో మేఘాలయకు చెందిన ఐదుగురు పౌరులతోపాటు అసోం అటవీశాఖ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మేఘాలయలో అసోంకు వ్యతిరేకంగా నిరసనలు భగ్గుమన్నాయి. అసోం నుంచి వస్తున్న ట్రక్కులు, లారీలపై మేఘాలయ వాసులు దాడులకు దిగారు.

పొరుగు రాష్ట్రంలో అసోం వాహనాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ‘ది అస్సాం పెట్రోలియం మజ్దూర్ యూనియన్’ స్పందించింది. అసోం నుంచి మేఘాలయ వెళ్లే ట్యాంకర్లకు ముప్పు పొంచి ఉందని, కాబట్టి వాటిలో ఇంధనం నింపొద్దని పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేసే ఐవోసీ, హెచ్‌పీసీఎల్ తదితర కంపెనీలను కోరింది. విషయం తెలిసిన మేఘాలయ వాసులు పెట్రోలు, డీజిల్ కోసం బంకుల వద్ద బారులు తీరారు. పెట్రోలు కొరత భయంతో ముందుగానే వాహనాలను నింపుకోవాలన్న జాగ్రత్తతో పెట్రోలు బంకులకు పరుగులు తీశారు. దీంతో బంకుల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి.

కాగా, మేఘాలయలో జరిగిన ఆందోళనల్లో తమ డ్రైవర్లు, క్లీనర్లు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో కొందరు శాశ్వత అంగవైకల్యం పొందారని ఏపీఎంయూ ప్రధాన కార్యదర్శి రామెన్‌దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము అసోంకు పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేయలేమని తెగేసి చెప్పారు. ఏపీఎంయూ నిర్ణయంపై మేఘాలయ పెట్రోలు పంప్ డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వం కలగజేసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుకు కొరత తప్పదని పేర్కొంది.

  • Loading...

More Telugu News