EPFO: వేతన సీలింగ్ సవరణకు ఈపీఎఫ్వో రెడీ.. 75 లక్షల మందికి స్వీట్ న్యూస్!
- వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచే యోచన
- పెరగనున్న ఉద్యోగులు, యజమానులు చెల్లించే వాటా
- రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల చేతికి సొమ్ము
వేతన జీవులకు ఇది శుభవార్తే. పెన్షన్ పథకానికి సంబంధించి ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(సీలింగ్)ని పెంచాలని ఈపీఎఫ్వో నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే జరిగితే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల చేతికి అందే మొత్తం భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం రూ. 15 వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ. 21 వేలకు సవరించాలని ఈపీఎఫ్వో యోచిస్తోంది. అప్పుడు ఉద్యోగులు, యజమానులు చెల్లించే వాటా కూడా పెరుగుతుంది. ఫలితంగా ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాకు జమయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. ఇద్దరి వాటాలకు వడ్డీ వర్తిస్తుంది కాబట్టి ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.
ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని కేంద్రం చివరిసారి 2014లో సవరించింది. అప్పట్లో రూ. 6,500గా ఉన్న పరిమితిని రూ. 15 వేలకు పెంచారు. అయితే, 20 మంది అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. 8 సంవత్సరాల తర్వాత పరిమితిని పెంచాలని భావిస్తున్న కేంద్రం ఇందుకోసం ఓ కమిటీని నియమించే అవకాశం ఉంది. అలాగే, తాజా నిర్ణయంతో దాదాపు 75 లక్షల మంది పీఎఫ్వో పరిధిలోకి వస్తారని అంచనా.