Gujarat: విద్యుత్ నుంచి డబ్బు సంపాదించే కళ నాకు మాత్రమే తెలుసు: మోదీ
- గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ
- ఉచిత విద్యుత్ హామీలతో కాంగ్రెస్, ఆప్ దూకుడు
- కాంగ్రెస్ ఎప్పటికీ అభివృద్ధి చేయలేదన్న ప్రధాని
విద్యుత్ నుంచి డబ్బు సంపాదించే కళ తనకు మాత్రమే తెలుసని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఆరావళి జిల్లా మోదసా పట్టణంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ నుంచి ఆదాయం సృష్టించాలి తప్ప, దానిని ఉచితంగా ఇవ్వాలనుకోవడం సరికాదని అన్నారు. విద్యుత్‌ను ఉచితంగా పొందడం కంటే సౌరశక్తి ద్వారా పొందే అదనపు విద్యుత్ నుంచి గుజరాత్ ప్రజలు ఆదాయం పొందాలనేది తన కోరిక అని అన్నారు.
100 శాతం సౌరశక్తిపై ఆధారపడిన మోహసానా జిల్లాలోని మోధేరా గ్రామాన్ని చూడాలని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఆ గ్రామ ప్రజలు తమ విద్యుత్ అవసరాలన్నీ తీర్చుకోవడమే కాకుండా ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారని అన్నారు. గుజరాత్ మొత్తాన్ని తాను ఇలా చూడాలనుకుంటున్నట్టు చెప్పారు.
ఎలాగైనా అధికారంలోకి రావాలని వారు తాపత్రయ పడుతున్నారంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ విమర్శించారు. వారిది విభజించు, పాలించు సిద్ధాంతమన్నారు. పక్కనున్న రాజస్థాన్‌లో ఒక్క మంచి వార్త కూడా వినిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పటికీ అభివృద్ధి చేయలేదని విరుచుకుపడ్డారు. కాగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉచిత విద్యుత్ హామీలతో ప్రజల ఓట్లు పొందే ప్రయత్నం చేస్తుండడంతో కౌంటర్‌గా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.