Errakota Chennakesava Reddy: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే
- వనభోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు
- తన వయసు మీదపడిందని, గుండె జబ్బు ఉందని జగన్‌కు చెప్పానన్న చెన్నకేశవరెడ్డి
- తన కొడుక్కి టికెట్ వస్తే సహకరించాలని అభ్యర్థన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇటీవల ఎమ్మిగనూరులో ఉప్పర సంఘం ఆధ్వర్యంలో జరిగిన వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరారని, కానీ తన వయసు 83 సంవత్సరాలని, గుండె జబ్బు కూడా ఉందని చెప్పానని అన్నారు.
జనంలో ఎక్కువ సేపు తిరగలేనని, ఎక్కువ సేపు మాట్లాడలేనని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని జగన్‌తో చెప్పానని అన్నారు. తన కుమారుడు ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో సర్వే చేస్తున్నట్టు జగన్ తనతో చెప్పారని, కాబట్టి టికెట్ వస్తే అందరూ సహకరించాలని కోరారు. ఆయన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, చెన్నకేశవరెడ్డి 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు.