Yashoda Movie: ఓటీటీలోకి ఆలస్యంగా రానున్న 'యశోద'.. కారణం ఇదే!
- ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'యశోద'
- తమ ఆసుపత్రిని నెగెటివ్ గా చూపించారంటూ ఈవా ఐవీఎఫ్ ఆసుపత్రి కేసు
- డిసెంబర్ 19 వరకు ఓటీటీలో విడుదల చేయొద్దన్న కోర్టు
సమంత ప్రధాన పాత్రను పోషించిన 'యశోద' చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. సరోగసీ (అద్దె గర్భం) కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
మరోవైపు, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ చేజిక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఓటీటీలో విడుదల అయ్యేందుకు మరింత సమయం పట్టనుంది. ఈ సినిమాపై ఈవా ఐవీఎఫ్ హాస్పిటల్ హైదరాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఈ చిత్రంలో తమ ఆసుపత్రిని నెగెటివ్ గా చూపించారని... ఈ సినిమాను నిలిపివేయాలని కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో, ఓటీటీలో ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 వరకు విడుదల చేయవద్దని సినీ నిర్మాతలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలోకి ఆలస్యంగా రానుంది.