fifa world cup: ఫిఫా ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లోనే వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన రొనాల్డో
- వరుసగా ఐదు వరల్డ్ కప్స్ లో గోల్ సాధించిన తొలి ఆటగాడిగా ఘనత
- గ్రూప్-హెచ్ మ్యాచ్ లో 3-2తో ఘనాను ఓడించిన పోర్చుగల్
- ప్రపంచ కప్స్ లో మొత్తం ఎనిమిది గోల్స్ తో మెస్సీని అధిగమించిన రొనాల్డో
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో బరిలోకి దిగిన తన తొలి మ్యాచ్ లోనే సాకర్ సూపర్ స్టార్, పోర్చుగల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఐదు వరల్డ్ కప్స్‌లో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రొనాల్డో 2006 నుంచి వరుసగా ఐదు ప్రపంచ కప్స్ లో పోటీ పడ్డాడు. 2010, 2024, 2018, 2022 లో పాల్గొన్నాడు. ప్రతీ ప్రపంచ కప్ లోనూ కనీసం ఒక్క గోల్ అయినా చేసిన మొదటి ఆటగాడిగా ఘనత సాధించాడు. గురువారం రాత్రి జరిగిన గ్రూప్–హెచ్ మ్యాచ్‌లో రొనాల్డోతో పాటు జావో ఫెలిక్స్, రఫెల్ లెయవో చెరో గోల్ చేయడంతో పోర్చుగల్ 3–2తో ఘనాను ఓడించింది.
ఈ మ్యాచ్ రెండో అర్ధ భాగంలోనే ఐదు గోల్స్ నమోదయ్యాయి. 65వ నిమిషంలో దక్కిన పెనాల్టీకి రొనాల్డో గోల్ చేసి ఖాతా తెరువగా.. ఫెలిక్స్ (78వ నిమిషంలో), లెయవో (80వ నిమిషంలో) చెరో గోల్ చేసి పోర్చుగల్ ను గెలిపించారు. ఘనా తరఫున ఆండ్రీ అయెవ్ (73 వ. నిమిషంలో), ఒస్మాన్ బుకారి (89వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.
కాగా, ప్రపంచ కప్ లో ఎనిమిదో గోల్స్ చేసిన రొనాల్డో ఈ టోర్నీలో ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మరో అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ (7 గోల్స్)ని అధిగమించాడు. అలాగే, ప్రపంచ కప్ లో గోల్ సాధించిన రెండో పెద్ద వయస్కుడిగానూ రొనాల్డో రికార్డు సాధించాడు. అతను 37 ఏళ్ల 292 రోజుల వయసులో వరల్డ్ కప్‌లో గోల్ చేశాడు. 1994లో కామెరూన్‌కు చెందిన రోజర్ మిలా 42 ఏళ్ల వయసులో గోల్ సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు.