Team India: ఫార్మాట్ మారినా పంత్ ఆట మారడం లేదు.. మళ్లీ నిరాశ పరిచిన భారత కీపర్
- న్యూజిలాండ్ తో తొలి వన్డేలో ఫెయిల్
- 23 బంతుల్లో 15 పరుగులే చేసి ఔట్
- 4 పరుగులతో నిరాశ పరిచిన సూర్య కుమార్
భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్ మారినా అతని ఆట మాత్రం మారడం లేదు. న్యూజిలాండ్ పై ఆడిన రెండు టీ20ల్లోనూ అతడు పేలవ షాట్లతో వికెట్ పారేసున్నాడు. తాజాగా, వన్డే ఫార్మాట్ లోనూ అదే వైఫల్యం కొనసాగించాడు. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. నాలుగో నంబర్ లో బ్యాటింగ్ కు వచ్చిన పంత్ 23 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే సాధించాడు. రెండు ఫోర్లు కొట్టిన అతను ఫెర్గూసన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు.
మరో వైపు టీ20 సిరీస్ లో సెంచరీతో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసిన అతను కూడా ఫెర్గూసన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఓపెనర్లు శిఖర్ ధవన్ (72), శుభ్ మన్ గిల్ (50) అర్ధ సెంచరీలతో రాణించారు. మిడిలార్డర్ లో పంత్, సూర్యకుమార్ విఫలమవగా.. శ్రేయస్ అయ్యర్ (48 నాటౌట్), సంజూ శాంసన్ (25 నాటౌట్) బాధ్యత తీసుకొని ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతున్నారు. దాంతో, 41 ఓవర్లకు 4 వికెట్లకు 217 పరుగులు చేసిన భారత్ మంచి స్కోరు చేసే దిశగా సాగుతోంది.