Tejashwi Yadav: తేజస్వి, ఆదిత్య భేటీతో ఏ సందేశం ఇద్దామనుకుంటున్నారు?: బీజేపీ
- లాలూ యాదవ్ ఎప్పుడూ కూడా శివసేనను ఇష్టపడలేదన్న షానవాజ్
- ఎన్నో ఏళ్లుగా వ్యతిరేకించిన విషయం ప్రస్తావన
- అధికారం కోసం ఎవరితో అయినా కలవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మరోసారి ఆర్జేడీ, శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం పార్టీ నిరూపించాయి. ఉద్ధవ్ థాకరే కుమారుడు, ఆదిత్య థాకరే గురువారం ఆర్జేడీ ముఖ్యనేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో భేటీ కావడం తెలిసిందే. దీనిపై బీజేపీ విమర్శలు కురిపించింది.
బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ.. "ఒకప్పుడు బాలాసాహెబ్ థాకరే శివసేనకు దూరంగా ఉన్న వారు, ఇప్పుడు వారితో స్నేహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మహాకూటమి అధికారం కోసం ఎంత వరకైనా వెళుతుందన్నది బీహార్ ప్రజలు గమనిస్తున్నారు. లాలూ యాదవ్ ఎప్పుడూ అసలు శివసేనను ఇష్టపడలేదు. ఎన్నో ఏళ్లుగా బాలాసాహెబ్ ను వ్యతిరేకించారు. కానీ, నేడు స్నేహితులుగా మారారు. అధికారం కోసం ఆర్జేడీ, శివసేనతోనూ చేతులు కలుపుతుండడాన్ని బీహార్ ప్రజలు గమనిస్తున్నారు’’ అని షానవాజ్ హుస్సేన్ పేర్కొన్నారు.
తన ఆకుపచ్చని జెండాకు, కాషాయ జెండాను జోడించడం ద్వారా లాలూ యాదవ్ ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఆర్జేడీ చెప్పాలని షానవాజ్ హుస్సేన్ అన్నారు. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ తో ప్రచారం చేయించడం ద్వారా బీహారీల ఓట్లు సంపాదించుకోవాలన్నది శివసేన ఎత్తుగడగా కనిపిస్తోంది.