heart attack: గుండెపోటు వచ్చినప్పుడు ఇలా ఉంటుంది.. బాధితుల స్పందన
- ఛాతీ భాగంలో బండరాయి పెట్టినంత తీవ్రమైన నొప్పి
- శ్వాస తీసుకోలేకపోవడం, కదల్లేని పరిస్థితి
- త్రేనుపు రూపంలోనూ సమస్య కనిపించొచ్చు
- విపరతీమైన చెమట పోస్తుందంటున్న బాధితులు
హార్ట్ ఎటాక్ ఎక్కువ కేసుల్లో ప్రాణాంతకం అవుతుంది. హార్ట్ ఎటాక్ వస్తే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటుంది? అన్న సందేహం కూడా చాలా మందిని వేధిస్తుంటుంది. దీనిపై హార్ట్ ఎటాక్ బారిన పడి, ప్రాణాలతో బయటపడిన వారి అనుభవాలను తెలుసుకోవాల్సిందే.
నిజానికి హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి అది హార్ట్ ఎటాక్ అని తెలియదు. లక్షణాలపై అవగాహన లేకపోవడంతో, వచ్చింది హార్ట్ ఎటాక్ అని గుర్తించలేరు. జాప్యం చేస్తే ప్రాణానికి ముప్పు ఏర్పడుతుంది. వెంటనే వైద్యం అంది ప్రాణాలతో బయటపడే వారు ఎందరో ఉంటారు. అలా బయటపడిన వారి అనుభవాలు చూద్దాం.
‘‘ఐదు నిమిషాల పాటు ఎంతో అలసటగా అనిపించింది. శ్వాస తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది కలిగింది. చెమటలు విపరీతంగా పోశాయి. కదల్లేకపోయాను. చెమటలు పట్టడం, శ్వాసతీసుకోలేకపోవడమనే ఇబ్బంది కొంత సమయానికి ఇంకా ఎక్కువైంది. భారీ బండరాయిని నా ఛాతీపై పెట్టినంత నొప్పి వచ్చింది. అది అక్కడి నుంచి ఛాతీ వెనుక (వీపు) భాగంంలోకి, చేతుల్లోకి పాకింది. ముఖ్యంగా ఎక్కువ నొప్పి ఎడమ చేతి వైపునకు వెళ్లింది.
45 నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ 185/125, హార్ట్ రేటు 160గా ఉంది. కొంత సమయం తర్వాత బీపీ 150/110, హార్ట్ రేట్ 120కి తగ్గాయి. కార్డియాక్ ట్రోపోనిన్ టెస్ట్ చేయగా అవి పెరిగిపోయి ఉన్నాయి. (ట్రోపోనిన్ అనే ప్రొటీన్లు గుండె కండరం దెబ్బతిన్నప్పుడు రక్తంలోకి ఎక్కువగా విడుదల అవుతాయి) ఇది హర్ట్ ఎటాక్ కు సంకేతం. నా గుండె రేటు, బీపీ తగ్గేందుకు మందులు ఇచ్చారు వైద్యులు’’ అని లోగడ హార్ట్ ఎటాక్ ను అనుభవించిన డేవ్ పార్క్ అనే వ్యక్తి ఆన్ లైన్ ఫోరమ్ లో విషయాలను పంచుకున్నారు.
సుసాన్ లాంగ్ అనే మరో వ్యక్తి సైతం తన హార్ట్ ఎటాక్ అనుభవాలను పంచుకున్నారు. ‘‘రాత్రి 11 గంటల సమయం. అజీర్ణం వల్ల త్రేనుపు నా ఎడమ ఛాతీ వైపు ఉన్నట్టు అనిపించింది. దాన్ని బయటకు పంపించేందుకు అటూ, ఇటూ నడిచాను. కానీ లాభం లేదు. తర్వాత గొంతులోకి వచ్చినట్టు అనిపించింది. అయినా కానీ, అది బయటకు వెళ్లడం లేదు. ఇక ఆ తర్వాత తీవ్ర చెమట పోయడం మొదలైంది. నాకు ఏదో తేడా జరుగుతుందని, హార్ట్ ఎటాక్ వచ్చిందేమోనని అనిపించింది. వెంటనే అంబులెన్స్ కు కాల్ చేశాను.
అంబులెన్స్ వచ్చి నన్ను లోపలికి చేర్చింది. నైట్రోగ్లిజరిన్ మాత్ర ఇచ్చింది. నా లక్షణాలు హార్ట్ ఎటాక్ కు సంబంధించినవిగా చెప్పారు. నాకు నొప్పి కాని, ఒత్తిడి కానీ అనిపించలేదని అంబులెన్స్ వైద్య సిబ్బందితో చెప్పా. చెమట అంత తీవ్రంగా పోయకపోతే అత్యవసర కాల్ సెంటర్ కు కాల్ చేయకపోయి ఉండేదాన్ని’’ అని ఆమె చెప్పింది. ఎడమ చేతి వైపు ప్రధాన ఆర్టరీ లో బ్లాకేజీ ఏర్పడినట్టు గుర్తించిన వైద్యులు ఆమెకు స్టెంట్ వేశారు.
38 ఏళ్ల మరో బాధిత వ్యక్తి తన అనుభవాన్ని షేర్ చేస్తూ.. ‘‘నా స్టెర్నమ్ భాగంలో (సరిగ్గా ఛాతీ మధ్య భాగంలో) ఏదో ఆగిపోయినట్టు (ఇరుక్కునట్టు) అసౌకర్యంగా అనిపించింది. తర్వాతి రోజు లేస్తూనే తీవ్రమైన ఒత్తిడి, నొప్పి అదే భాగంలో వచ్చాయి. అది గ్యాస్ట్రిక్ సమస్య అనుకున్నాను. కానీ నొప్పి ఎక్కువగా ఉండడంతో అవ్యవసర వైద్యం కోసం వెళ్లాను. నాకు మేజర్ హార్ట్ ఎటాక్ వచ్చినట్టు గుర్తించిన వైద్యులు 30 నిమిషాల తర్వాత స్టెంట్ వేశారు’’ అని వివరించారు.