New York: ప్రయాణికుడి సూట్ కేస్ లో పిల్లి.. విమాన సిబ్బంది ఏం చేశారంటే..!
- న్యూయార్క్ ఎయిర్ పోర్టులో చెకింగ్ లో సంఘటన
- లగేజీ స్కానింగ్ లో సూట్ కేస్ లో పిల్లి ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది
- అది తన లగేజీలోకి ఎలా వచ్చిందో తెలియదంటున్న ప్రయాణికుడు
విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయనిదే లోపలికి అనుమతించరు. విమాన ప్రయాణికుల లగేజీని స్కానింగ్ చేస్తారు. వాళ్ల బ్యాగులు, సూట్ కేసుల్లో ఏముందో తెలుసుకున్న తర్వాతే క్యాబిన్ లోకి పంపిస్తారు. ఇలా న్యూయార్క్ జేఎఫ్ కే అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసిన అక్కడి సిబ్బంది అవాక్కయ్యారు. సదరు ప్రయాణికుడి సూట్ కేసులో ఓ పిల్లి ఉన్నట్టు స్కాన్ లో తేలడంతో అంతా షాకయ్యారు.
న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా వెళ్తున్న ప్యాసింజర్ కు చెందిన లగేజీలో పిల్లిని గుర్తించారు. మొదట షాకైన సెక్యూరిటీ సిబ్బంది తర్వాత దాన్ని బయటకు తీసి తిరిగి సదరు ప్రయాణికుడికే అప్పగించారు. ఈ విషయాన్ని జేఎఫ్ కే ఎయిర్ పోర్టు సిబ్బంది ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కాగా, తన పెంపుడు పిల్లి సూట్ కేస్ లోకి ఎలా వచ్చిందో తెలియదని సదరు ప్రయాణికుడు పేర్కొన్నాడు.