Chiranjeevi: స్కైరూట్ బృందానికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు
- ఇటీవల ప్రైవేటు రాకెట్ ను ప్రయోగించిన ఇస్రో
- విక్రమ్-ఎస్ ను రూపొందించిన హైదరాబాద్ స్టార్టప్ సంస్థ స్కైరూట్
- చిరంజీవితో తమ ఆనందాన్ని పంచుకున్న స్కైరూట్ ప్రతినిధులు
భారత అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా ప్రైవేటు సంస్థ నిర్మించిన రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. ఈ రాకెట్ పేరు విక్రమ్-ఎస్ (విక్రమ్ సబార్టియల్) కాగా, ఈ రాకెట్ ను హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ సంస్థ తయారు చేసింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఓ ప్రైవేటు రాకెట్ ప్రయోగం ఇదే ప్రథమం.
రాకెట్ ను ఎలాంటి లోపాలు లేకుండా తయారుచేసిన స్కైరూట్ సంస్థ పేరు ఘనంగా వినిపిస్తోంది. తాజాగా, స్కైరూట్ సంస్థ యువ శాస్త్రవేత్తల బృందం మెగాస్టార్ చిరంజీవి నుంచి అభినందనలు అందుకుంది.
స్కైరూట్ ప్రతినిధులు హైదరాబాదులో చిరంజీవిని కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. విక్రమ్-ఎస్ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో చిరంజీవి స్కైరూట్ ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందించారు. చిరంజీవి అంతటివాడు తమను పొగడ్తల జల్లులో ముంచెత్తడం పట్ల స్కైరూట్ ప్రతినిధులు పొంగిపోయారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.