Raja: వికటించిన జ్యోతిష్యుడి సలహా... పాము కాటుతో నాలుక కోల్పోయిన తమిళనాడు వ్యక్తి

Tamilnadu man lost his tongue after an astrologer advice

  • తరచుగా పాము కాటేస్తున్నట్టు ఓ రైతుకు కలలు
  • జ్యోతిష్యుడ్ని సంప్రదించిన వైనం
  • పాము పుట్ట ఉన్న ఆలయంలో పూజలు చేయాలన్న జ్యోతిష్యుడు
  • కసిదీరా కాటేసిన రక్తపింజరి పాము

జ్యోతిష్యుడి మాటలు విని ఓ వ్యక్తి నాలుక కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈరోడ్ లోని గోపిచెట్టిపాళయంకు చెందిన రాజా ఓ రైతు. ఆయన వయసు 54 సంవత్సరాలు. రాజాకు ఇటీవల తరచుగా పాము కరుస్తున్నట్టుగా కలలు వస్తున్నాయి. దాంతో భయపడిపోయిన ఆ రైతు ఓ జ్యోతిష్యుడి వద్దకు పరుగెత్తాడు. 

పాము కాటేస్తున్నట్టు కలలు వస్తున్న విషయాన్ని అతడికి వివరించాడు. దాంతో, ఈ పీడకలలు తొలగిపోవాలంటే పాము పుట్ట ఉన్న ఓ సర్పదేవాలయానికి వెళ్లి పూజలు చేయాలని, పాము ముందు మూడుసార్లు నాలుక బయటికి చాపాలని సలహా ఇచ్చాడు. 

ఆయన చెప్పినట్టుగానే రాజా ఓ సర్ప మందిరానికి వెళ్లి పూజలు చేశాడు. అనంతరం, ఆలయంలోని పుట్ట వద్దకు వెళ్లి మూడుసార్లు నాలుక బయటికి చాపాడు. అయితే ఆ పుట్టలో ఉన్న రక్తపింజరి పాము రాజా నాలుకపై కసిదీరా కాటేసింది. ఇది గమనించిన ఆలయ పూజారి, రాజా కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు. కాటు వేసిన నాలుక భాగాన్ని కోసివేసి, రాజాను హుటాహుటీన ఈరోడ్ లోని మణియన్ ఆసుపత్రికి తరలించారు. 

ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే రాజా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సగం తెగిపోయిన అతడి నాలుకకు చికిత్స చేసిన వైద్యులు, పాము విషానికి విరుగుడుగా యాంటీ వీనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడని ఆసుపత్రి ఎండీ సెంథిల్ కుమరన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News