Imran Khan: పాకిస్థాన్ లోని అన్ని అసెంబ్లీల నుంచి తమ ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించాలని ఇమ్రాన్ నిర్ణయం
- ఇటీవల ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు
- ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మాజీ ప్రధాని
- కాల్పుల ఘటన తర్వాత మళ్లీ జనాల్లోకి వచ్చిన ఇమ్రాన్
- రావల్పిండిలో భారీ సభ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనపై దాడి జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి వచ్చారు. నేడు రావల్పిండిలో ఓ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలోని అన్ని అసెంబ్లీల నుంచి తమ పీటీఐ పార్టీ ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయిస్తున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఇక, తనకు మరోసారి ప్రాణహాని ముప్పు ఉందని సంచలన ప్రకటన చేశారు. ఇటీవల వజీరాబాద్ లో దాడి వెనుక ఉన్న 'ముగ్గురు నేరస్తులు' తనను చంపడానికి మరో అవకాశం కోసం చూస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, హోంమంత్రి రాణా సనావుల్లా, ఐఎస్ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ చీఫ్ మేజర్ జనరల్ ఫైజల్ నజీర్ తనపై దాడి వెనుక సూత్రధారులు అని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ ముగ్గురిని ఆయన 'క్రిమినల్స్' అని అభివర్ణిస్తున్నారు.
రావల్పిండి సభలో ఆయన మాట్లాడుతూ, పీటీఐ కార్యకర్తలు స్వేచ్ఛగా బతకాలంటే మొదట చావు భయం నుంచి విముక్తులు కావాలని పిలుపునిచ్చారు. భయం అనేది దేశం మొత్తాన్ని బానిసత్వంలోకి నడిపిస్తుందని అన్నారు. తనపై ఇటీవల దాడి జరిగినా తాను మాత్రం వెనుకంజ వేసే ప్రసక్తేలేదని, ముందుకే వెళతానని ఇమ్రాన్ స్పష్టం చేశారు. మృత్యువంటే తనకు భయంలేదని, ఎందుకంటే దాన్ని దగ్గరగా చూశానని వివరించారు.