tihar jail: తీహార్ జైలు గదిలో పది మందితో ఆప్ మంత్రి సత్యేంద్రకు సేవలు!
- ఎనిమిది మంది వివిధ పనులకు వినియోగం
- పర్యవేక్షకులుగా మరో ఇద్దరు ఉన్నారంటూ ఆంగ్ల పత్రిక కథనం
- జైలులో ప్రత్యేక ఆహారం ఇవ్వాలన్న మంత్రి పిటిషన్ కొట్టేసిన కోర్టు
ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేంద్ర జైన్ తీహార్ జైలులో వీవీఐపీ సౌకర్యాలు పొందుతున్న వీడియోలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. బీజేపీ విడుదల చేసిన ఈ వీడియోలు ఆప్ పార్టీని ఇరకాటంలో పెట్టాయి. జైల్లో ఉన్న వ్యక్తికి ఇలాంటి సౌకర్యాలు లభించడంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ విషయంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. జైలు గదిలో సత్యేంద్ర జైన్‌కు అన్ని సేవలను అందించడానికి పది మంది వ్యక్తులను నియమించినట్లు తెలుస్తోంది. ఇందులో ఎనిమిది మంది జైన్ అవసరాలను చూసుకుంటున్నారు. ఆయన గదిని శుభ్రం చేయడం, మంచం వేయడం, బయట నుంచి ఆహారం, మినరల్ వాటర్, పండ్లు, బట్టలు అందించడం వంటి సేవలు చేస్తున్నారు.
ఆయన పర్యవేక్షకులుగా మరో ఇద్దరు వ్యక్తులు పనిచేశారని తీహార్ జైలు వర్గాలు చెప్పినట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. మరోవైపు జైలులో ప్రత్యేక ఆహారం కోరుతూ సత్యేంద్ర జైన్ వేసిన పిటిషన్‌ను రోస్ అవెన్యూ కోర్టు శనివారం తోసిపుచ్చింది. తనకు 'జైన్ ఆహారం' ఇవ్వలేదని, ఆలయ ప్రవేశం లేదని పేర్కొన్నారు. తాను ఆలయానికి వెళ్లకుండా సాధారణ ఆహారం తిననని చెప్పారు. కొన్ని రోజులుగా తనకు సరైన ఆహారం అందడం లేదని ఆప్ నేత చేసిన ఫిర్యాదుపై తీహార్ జైలు అధికారులను కోర్టు సమాధానం కోరింది. తనకు జైలులో పండ్లు, డ్రై ఫ్రూట్స్ కావాలంటూ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధుల్ తోసిపుచ్చారు.