Team India: వదలని వర్షం.. భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే రద్దు

heavy rain in hamilton second od canceled

  • భారత్ మెరుగైన స్థితిలో ఉన్నప్పుడు వాన అంతరాయం
  • వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేసిన అంపైర్లు
  • ఈ నెల 30వ తేదీన మూడో వన్డే

భారత్, న్యూజిలాండ్ జట్లను వరుణుడు వెంటాడుతున్నాడు. భారీ వర్షం కారణంగా హామిల్టన్ లో ఆదివారం జరగాల్సిన రెండో వన్డే రద్దయింది. ఈ మ్యాచ్ మొదలైనప్పటి నుంచి వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. 29 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ కు వచ్చింది. టీమిండియా 12.5 ఓవర్లలో 89/1 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న దశలో వర్షం పడటంతో ఆట ఆగింది. శుభ్‎మన్ గిల్ 42 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‎తో 45 రన్స్ చేయగా. సూర్యకుమార్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులతో నిలిచాడు.  

అప్పటి నుంచి మైదానంలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేసినట్లు ప్రకటించారు. తొలి వన్డేలో నెగ్గిన న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఈ నెల 30న జరగనుంది.  భారత్ సిరీస్ ను సమం చేసుకోవాలంటే చివరి వన్డేలో కచ్చితంగా గెలవాల్సిందే. ఒకవేళ వర్షం వల్ల ఆ మ్యాచ్ లోనూ ఫలితం రాకుంటే తొలి వన్డే విజయం ఆధారంగా న్యూజిలాండ్ సిరీస్ గెలుస్తుంది. కాగా, ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ కు వరుణుడు అడ్డు తగిలాడు. తొలి టీ20 రద్దవగా.. మూడో మ్యాచ్ కూడా వర్ష ప్రభావితం అయింది.

  • Loading...

More Telugu News