Perni Nani: బొత్స సంగతి సరే... చంద్రబాబు దగ్గర నువ్వేం చేస్తున్నావు?: పేర్ని నాని
- నిన్న పవన్ కల్యాణ్ తూర్పు కాపులతో సమావేశం
- నేడు ఇప్పటం గ్రామస్తుల సభలో వైసీపీపై విమర్శలు
- తీవ్రస్థాయిలో స్పందించిన పేర్ని నాని
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పవన్ నిన్న మా వాళ్లు తూర్పు కాపులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడని, బొత్స సత్యనారాయణకు మీరు ఓటు వేస్తే ఆయన ఏంచేశాడని అంటున్నాడని, సీఎం జగన్ వద్ద నోరుమూసుకుని ఉంటున్నాడని విమర్శించాడని పేర్ని నాని మండిపడ్డారు.
బొత్స సరే... మరి నువ్వు చంద్రబాబు దగ్గర ఏంచేస్తున్నావు? నోరు మూసుకుని ఉండలేదా? అని నిలదీశారు. "మేం ఒక పార్టీని నమ్ముకున్నాం... నేను, బొత్స గారు, అప్పలనరసయ్య, అప్పలనాయుడు వైసీపీలో ఉన్నాం. వైఎస్సార్ కుమారుడు జగన్ మా నాయకుడు... మాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మరి తమరెవరు? మా వాడివే! మీ పార్టీ ఏమిటి... జనసేన పార్టీ... అధ్యక్షులు ఎవరు... తమరే! కానీ తమరు ఎవరికి వంత పాడుతున్నారు, ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిల్చుంటున్నారు... చంద్రబాబు దగ్గర!
ఏమిటీ పిచ్చి ప్రేలాపనలు! మొన్నటిదాకా కులాలు వద్దన్నావు, కాపులకు రిజర్వేషన్లు ఎవడు చెప్పాడని చంద్రబాబు కోసం అప్పుడేవో మాట్లాడావు. ఇప్పుడొచ్చి కులభావం లేని సమాజాన్ని చూస్తే నాకు బాధేస్తుంది అంటున్నావు. వైసీపీలోని నేతలకు కులభావం లేదని బాధపడిపోయావు. ఇక్కడ కాపుల సంగతి అయిపోయింది, రాయలసీమ వెళ్లి బలిజల సంగతి చూశారు... అదీ అయిపోయింది. ఇప్పుడు తూర్పు కాపులు... వీళ్లను కూడా కైమా కొట్టేసి తామరాకుల్లో చుట్టి చంద్రబాబుకు అప్పగించారు.
అదృష్టవశాత్తు బతికిపోయింది ఎవరయ్యా అంటే... మున్నూరు కాపులు! కానీ అక్కడ కేసీఆర్ ఉన్నాడు... మనోడికి కేసీఆర్ అంటే గజగజ. అందుకే అటు వెళ్లడు. మూడు జిల్లాల్లో ఓబీసీ సర్టిఫికెట్ ఇస్తున్నారు, మిగతా జిల్లాల్లో ఇవ్వడంలేదని అంటున్నారు... నీ యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నాం. కనీసం తెరమీదన్నా ఉంటే పాన్ ఇండియా స్టార్ అయ్యుండేవాడివి. అక్కడ సీను లేదు... ఇక్కడికొచ్చి యమా నటించేస్తున్నావు.
ఏ కులం ఏ ప్రాంతంలో ఏ కేటగిరీలోకి వస్తుందో కేంద్రం గెజిట్ లో పేర్కొంటుంది... దాని ప్రకారమే అధికారులు ఆ కులానికి ఓబీసీ సర్టిఫికెట్ జారీ చేస్తారు... పవన్ ఈ విషయం తెలుసుకోవాలి. విషయ పరిజ్ఞానం లేకుండా పవన్ పిచ్చితనంతో మాట్లాడుతున్నాడు" అంటూ పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు.