Abdel Fattah Al Sisi: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి
- జనవరి 26న గణతంత్ర దినోత్సవం
- వేడుకలకు సన్నద్ధమవుతున్న భారత్
- ముఖ్య అతిథిగా రావాలంటూ ఈజిప్టు అధ్యక్షుడికి ఆహ్వానం
భారత్ జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు సన్నద్ధమవుతోంది. ఈసారి గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి హాజరుకానున్నారు. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ దేశాధ్యక్షుడు భారత రిపబ్లిక్ డే ఉత్సవాలకు హాజరు కావడం ఇదే ప్రథమం అని పేర్కొంది.
కాగా, భారత రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే వేడుకలకు చీఫ్ గెస్టుగా రావాలంటూ ఈజిప్టు అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ఆహ్వానం పంపారు. ఈ ఆహ్వాన పత్రాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గత అక్టోబరు 16న స్వయంగా అల్ సిసీకి అందించారు. కాగా, గత రిపబ్లిక్ డే వేడుకలకు అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినా, బ్రిటన్ లో కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఆయన పర్యటన వాయిదా పడింది.