Mercedes Benz: భారతీయుల పొదుపు మా వ్యాపారానికి గొడ్డలిపెట్టు: మెర్సెడెజ్ బెంజ్
- పాశ్చాత్య దేశాల్లో మాదిరి భారత్ లో కాదన్న కంపెనీ
- ఇక్కడ తమ కోసం, పిల్లల కోసం చేసుకునే పొదుపు ఎక్కువని వెల్లడి
- లగ్జరీ కారు మార్కెట్ కు మళ్లిస్తే భారీ వ్యాపార వృద్ధి ఉంటుందన్న అభిప్రాయం
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సెడెజ్ బెంజ్.. భారత్ లో ఇన్వెస్టర్ల ‘సిప్’ సాధనం తమకు పోటీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిప్ అనేది సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ కు సంక్షిప్త రూపం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్ని రోజులకు ఒకసారి (వారం, పక్షం, మాసం) కోరుకున్నంత దీని ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు ఈ సిప్ లగ్జరీ కార్ల అమ్మకాల వృద్ధికి అవరోధమని మెర్సెడెజ్ బెంజ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ సంతోష్ అయ్యర్ వ్యాఖ్యానించారు.
బెంజ్ కార్లను సాధారణంగా ధనవంతులే కొనుగోలు చేస్తుంటారు. వారికి ప్రతి నెలా సిప్ రూపంలో పెట్టుబడులనేవి కార్ల కొనుగోలుకు అడ్డుకాబోవు. కనుక ఎగువ మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకుని సంతోష్ అయ్యర్ ఇలా మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రపంచంలో భారత్ బిలియనీర్ల పరంగా మూడో అతిపెద్ద దేశం కావడం గమనార్హం. ‘‘సిప్ లు మాకు పోటీదారులు. సిప్ పెట్టుబడుల సైకిల్ ను విచ్ఛిన్నం చేయగలిగితే, భారీ వృద్ధి (అమ్మకాల్లో) వస్తుంది’’ అని అయ్యర్ చెప్పారు.
కరోనా క్రాష్ తర్వాత ఈక్విటీ మార్కెట్లలోకి పెద్ద ఎత్తున రిటైల్ ఇన్వెస్టర్లు ప్రవేశించారు. వీరి రాకతో సిప్ పెట్టుబడులు కూడా పెరిగాయి. ప్రతి నెలా రూ.12,000 కోట్లు సిప్ రూపంలో ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులుగా వస్తున్నాయి. విషయం ఏమిటంటే బెంజ్ కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికంలో తన చరిత్రలోనే అత్యధికంగా అమ్మకాలను విక్రయించింది. పాశ్చాత్య ప్రపంచంలో మాదిరిగా కాకుండా భారత్ లో సామాజిక భద్రత రక్షణ పెద్దగా లేని విషయాన్ని సంతోష్ అయ్యర్ ప్రస్తావించారు. దీంతో భారతీయులు తమ కోసం, తమ పిల్లల కోసం పొదుపు చేస్తుంటారని చెప్పారు.
‘‘పాశ్చాత్య దేశాల్లో ఒకరు వారి కోసమే ఇన్వెస్ట్ చేసుకుంటారు. సిప్ లో ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేసే రూ.50,000 (ప్రతి నెలా)ను లగ్జరీ కారు మార్కెట్ వైపు మళ్లించగలిగితే (ఈఎంఐ రూపంలో) అప్పుడు వ్యాపారం ఎన్నో రెట్లు పెరుగుతుంది’’ అని అయ్యర్ వ్యాఖ్యానించారు.