AP High Court: హైకోర్టు జడ్జిల బదిలీలపై పోరాడటానికి ఏపీ న్యాయవాదుల జేఏసీ ఏర్పాటు

AP Advocates JAC formed to fight against High Court judges transfer

  • ఇటీవల హైకోర్టు జడ్జిల బదిలీలు
  • ఏపీ హైకోర్టు నుంచి ఇద్దరు జడ్జిలకు స్థానచలనం
  • భగ్గుమంటున్న న్యాయవాదులు
  • జడ్జిల బదిలీ వివక్షాపూరితమని విమర్శలు
  • కొలీజియం సిఫారసులపై నిరసనలు

ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ లు ఇటీవల బదిలీ కావడం తెలిసిందే. జస్టిస్ దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ రమేశ్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే వీరి బదిలీ వివక్షాపూరితమని భావిస్తున్న ఏపీ హైకోర్టు న్యాయవాదులు కొందరు కొలీజియం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు హైకోర్టులో తమ విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. 

ఈ క్రమంలో, జడ్జిల బదిలీ నిర్ణయంపై పోరాడాలని న్యాయవాదుల జేఏసీ ఏర్పాటైంది. జేఏసీ కన్వీనర్లుగా శ్రవణ్ కుమార్, కోటేశ్వరరావు, ప్రభు, ప్రసాద్ బాబు, అశోక్ నియమితులయ్యారు.

జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ ల బదిలీని న్యాయవాదుల జేఏసీ నేడు ఒక ప్రకటనలో ఖండించింది. న్యాయవాదుల జేఏసీ రేపటి నుంచి నిరసన కార్యాచరణకు దిగుతున్నట్టు ప్రకటించింది. భోజన విరామ సమయంలో హైకోర్టులో నల్లజెండాలతో నిరసన తెలియజేస్తామని జేఏసీ నేతలు వెల్లడించారు. సీజేఐ, కొలీజయం సభ్యులు, ఏపీ హైకోర్టు సీజేని కలిసి విజ్ఞాపనపత్రం అందజేస్తామని తెలిపారు. రేపు గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇస్తామని పేర్కొన్నారు. 

కేంద్ర న్యాయశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖకు కూడా వినతిపత్రం ఇస్తామని వివరించారు. తమ కార్యాచరణకు బార్ అసోసియేషన్ లో మెజారిటీ న్యాయవాదులు మద్దతు ఇస్తున్నారని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. జడ్జిల బదిలీలపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News