HCA: ఆటగాళ్ల నుంచి ఒక్కో మ్యాచ్‌కు రూ.15 లక్షలు.. అజారుద్దీన్‌పై తీవ్ర ఆరోపణలు

Serious Allegations On HCA Chief Mohammad Azharuddin

  • సెప్టెంబరు 26తోనే అజర్ పదవీ కాలం ముగిసిందన్న మాజీ అధ్యక్షులు
  • అజర్ పాలనలో హెచ్‌సీఏ భ్రష్టు పట్టిపోయిందని ఆవేదన
  • నిబంధనలకు విరుద్ధంగా జట్టులోకి 30 మందిని ఎంపిక చేస్తున్నారని ఆరోపణ
  • ఆటగాళ్ల ఎంపికను వ్యాపారంగా మార్చేశారని ఆగ్రహం

టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ మహ్మద్ అజారుద్దీన్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అర్షద్ అయూబ్, జి.వినోద్ సంచలన ఆరోపణలు చేశారు. నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ.. అజర్ పదవీ కాలం సెప్టెంబరు 26తోనే ముగిసిందన్నారు. అయినప్పటికీ ఆయన తప్పుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజర్ పాలనలో హెచ్‌సీఏ భ్రష్టుపట్టి పోయిందన్నారు. అండర్-14, 16, 19, 22, సీనియర్ జట్లకు ఆటగాళ్ల ఎంపికను వ్యాపారంగా మార్చేశారని ధ్వజమెత్తారు.

ఆటగాళ్ల నుంచి ఒక్కో మ్యాచ్‌కు రూ. 15 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వయసును నిర్దారించే ధ్రువీకరణ పత్రం కోసం కూడా రూ. 3 లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ఒక్కో జట్టుకు గరిష్ఠంగా 15 మందిని మాత్రమే ఎంపిక చేయాలని, కానీ నిబంధనలకు విరుద్ధంగా 30 మందిని తీసుకుంటున్నారని పేర్కొన్నారు. 

మరి వంకా ప్రతాప్ సంగతేంటి?
హెచ్‌సీఏలో అక్రమాలపై సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీ చైర్మన్ జస్టిస్ కక్రూ న్యాయస్థానానికి సమ్పర్పించిన నివేదిక నూటికి నూరుశాతం నిజమన్నారు. అవినీతిపరుడైన అజర్.. జస్టిస్ కక్రూపై విరుద్ధ ప్రయోజనాలంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పర్యవేక్షక కమిటీలోని వంకా ప్రతాప్‌కు విరుద్ధ ప్రయోజనాల నిబంధన వర్తించదా? అని ప్రశ్నించారు. ఆయన హెచ్‌సీఏ అకాడమీ డైరెక్టర్‌గా ఉంటాడని, ఆయన కుమార్తె హైదరాబాద్ జట్టుకు ఆడుతుందని, పర్యవేక్షక కమిటీలోనూ ఆయన ఉంటాడని, మరి ఇదెలా సాధ్యమని నిలదీశారు. పర్యవేక్షక కమిటీని వంకా ప్రతాప్ తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. 

డిసెంబరు 11న ఎన్నికల తేదీ ప్రకటిస్తాం
సెప్టెంబరు 26కే అజర్ పదవీకాలం పూర్తయిందని, కాబట్టి నిబంధనల ప్రకారం సర్వసభ్య సమావేశం నిర్వహించి ఎన్నికల తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే డిసెంబరు 11న ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక ఏజీఎం నిర్వహించి తామే ఎన్నికల తేదీని, రిటర్నింగ్ అధికారిని ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు పర్యవేక్షక కమిటీకి కూడా ఈ విషయం చెప్పామన్నారు. అలాగే, తెలంగాణలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారని, జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులు, బీసీసీఐ నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధమని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News