UK: వారానికి నాలుగు రోజులే ఆఫీసు.. యూకేలో వంద కంపెనీలలో అమలు

100 Companies In UK Switch To Four Day Working Week With No Pay Cut

  • ఉద్యోగులు హ్యాపీ.. ఉత్పాదకత బాగుందంటున్న కంపెనీలు
  • గతంతో పోలిస్తే ఉత్పాదకత కొంచెం కూడా తగ్గలేదని వివరణ
  • ఉద్యోగుల వలసలు ఆగిపోయాయని వెల్లడి

మల్టీ నేషనల్ కంపెనీలలో వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు కావడం తెలిసిందే.. కానీ యునైటెడ్ కింగ్ డమ్ లోని వంద కంపెనీలు దీనిని మరింత కుదించాయి. వారానికి నాలుగు రోజులు పనిచేస్తే చాలని తమ ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చాయి. అదికూడా జీతంలో ఎలాంటి కోత పెట్టకుండా, పని గంటలను సర్దుబాటు చేయకుండా.. నాలుగంటే నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని సూచించాయి. ఈ కొత్త విధానాన్ని కంపెనీలో శాశ్వత ప్రాతిపదికన అమలు చేయాలని నిర్ణయించాయి. దీనివల్ల ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, కంపెనీ ఉత్పాదకతలో మార్పులేదని వెల్లడించాయి.

నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్న వంద కంపెనీల్లో రెండు ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయని ‘ది గార్డియన్’ ఓ కథనాన్ని ప్రచురించింది. అవి.. ఆటమ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అవిన్. ఒక్కో కంపెనీలో సుమారు 450 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ పనితీరు ఎలా ఉందనేది అవిన్ సీఈవో ఆడమ్ రాస్ వెల్లడించారు. 

ఉద్యోగుల పనివేళలను నిజాయతీగానే తగ్గించినట్లు రాస్ చెప్పారు. ఐదు రోజుల పనిగంటలను కుదించి నాలుగు రోజులకు సర్దుబాటు చేయలేదని వివరించారు. ఈ కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ ఉత్పాదకత కొంచెం కూడా తగ్గలేదని తెలిపారు. తమ ఉద్యోగులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని, నిపుణులైన ఉద్యోగులు సంస్థలోనే కొనసాగుతున్నారని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల వలసలను ఇది అడ్డుకుంటుందని వివరించారు. కాగా, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, ఆక్స్ ఫర్డ్, బోస్టన్ యూనివర్సిటీ లకు చెందిన పరిశోధకులు సుమారు 3300 మంది ఉద్యోగులు ఉన్న 70 కంపెనీలలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తూ, ఫలితాలను పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News