margadarshi: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో సోదాలు.. ఆరోపణలను ఖండించిన సంస్థ ఉన్నతాధికారులు
- మేనేజర్లకు చెక్ పవర్ లేదన్న అధికారులు
- సంస్థ నిధులు వేరే కార్యకలాపాలకు మళ్లింపు
- వచ్చే నెలలో హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో సోదాలు
- వివరాలు వెల్లడించిన ఏపీ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ
- ఆరోపణలన్నీ అసత్యాలేనని కొట్టేసిన మార్గదర్శి ఉన్నతాధికారులు
మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో నిధుల వినియోగంపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ పేర్కొన్నారు. చిట్ ఫండ్ నిధులను ఇతర కార్యకలాపాలకు మళ్లించినట్లు కనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆర్థిక అవకతవకలు, రికార్డుల నిర్వహణ పైనా ఆడిట్ చేయిస్తామని ఆయన తెలిపారు. ఈమేరకు సచివాలయంలో రామకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మోసం జరిగేంత వరకూ వేచి ఉండకూడదనే ఉద్దేశంతో చిట్ ఫండ్స్ కంపెనీలలో తరచూ తనిఖీలు చేస్తుంటామని వివరించారు. అందులో భాగంగానే మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు.
మార్గదర్శి కార్యాలయాల్లో పనిచేస్తున్న మేనేజర్లు లేదా ఫోర్ మెన్ లకు చెక్ పవర్ లేదని, సంస్థ కార్యకలాపాలకు సంబంధించి మిగతా వివరాలు కూడా వారికి తెలియదని తాజా తనిఖీల ద్వారా బయటపడిందని రామకృష్ణ చెప్పారు. తాజాగా గుర్తించిన పలు లోపాలపై షోకాజ్ నోటీసులు జారీచేసి యాజమాన్యం నుంచి వివరణ కోరనున్నట్లు తెలిపారు. ఇక హైదరాబాద్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా వచ్చే నెల 7 తేదీ నుంచి 9వ తేదీ వరకు లేదా 14, 15 తేదీల్లో తనిఖీలు చేయనున్నట్లు వివరించారు. అయితే, మార్గదర్శి తన ఖాతాదారులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయట్లేదని రామకృష్ణ తెలిపారు. చిట్ ఫండ్ కంపెనీ నుంచి మళ్లించిన నిధుల మొత్తం ఎంతనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని వివరించారు.
ఆరోపణలలో కుట్ర కోణం..
రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ ఆరోపణలను మార్గదర్శి ఉన్నతాధికారులు కొట్టిపారేశారు. నిధుల మళ్లింపు విషయంలో ఆయన చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని వివరణ ఇచ్చారు. అరవై ఏళ్లుగా చట్టబద్ధంగా నడుస్తున్న కంపెనీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నమని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు జరిపిస్తోందని మండిపడ్డారు. ఖాతాదారుల్లో అనుమానాలు రేకెత్తించి, సంస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్ర పన్నినట్లు రామకృష్ణ ఆరోపణలతో బయటపడిందన్నారు. ఈ కుట్ర కోణాన్ని మార్గదర్శి ఖాతాదారులతో పాటు ప్రజల ముందు ఉంచుతామని సంస్థ ఉన్నతాధికారులు చెప్పారు.