tomato: తగ్గిన టమాట ధర.. ఆందోళనలో అన్నదాత
- ఒక్కసారిగా పడిపోయిన ధర.. కిలో రూ.2 పలుకుతున్న వైనం
- కూలీ ఖర్చు కూడా గిట్టుబాటు కాదంటున్న రైతులు
- మార్కెట్ కు తెచ్చిన పంటను అమ్మలేక, తిరిగి తీసుకెళ్లలేక ఆవేదన
నిన్నమొన్నటి వరకు అందనంత ఎత్తులో ఉన్న టమాట ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కిలో కూ రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు రెండు రూపాయలకు పడిపోవడంతో టమాట రైతులు ఆందోళన చెందుతున్నారు. రేటు దారుణంగా పడిపోవడంతో కనీసం కూలి డబ్బులు కూడా తిరిగొచ్చే పరిస్థితిలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో టమాట ధర దారుణంగా పడిపోయింది. దీంతో కనీస మద్దతు ధర కూడా దక్కట్లేదని రైతులు వాపోతున్నారు.
పత్తికొండ మార్కెట్ నుంచే ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులకు టమాటా ఎగుమతి అవుతుంది. దీంతో చుట్టుపక్కల రైతులతో పాటు దూరం నుంచి కూడా అన్నదాతలు తమ పంటను తీసుకొస్తారు. టమాట ధరలు రోజురోజుకూ పడిపోతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో అప్పటికే మార్కెట్ కు తెచ్చిన పంటను ఆ ధరకు అమ్మలేక, తిరిగి తీసుకెళ్లలేక మార్కెట్ లోనే టమాట పంటను పారబోసి కన్నీళ్లతో వెళ్లిపోతున్నారు. టమాట రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వరంగల్ మార్కెట్ లో పది రోజుల క్రితం దాకా కేజీ టమాట రూ.40 పలికిందని రైతులు చెప్పారు. సోమవారం రేటు ఒక్కసారిగా రూ.10 కి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధరకు అమ్మితే టమాట కోయడానికి కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కాదని వాపోతున్నారు.