YS Vijayamma: వైఎస్ వివేకా హత్య కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయి: సుప్రీంకోర్టు
- వివేకా హత్య కేసు విచారణను హైదరాబాద్ కు బదిలీ చేసిన సుప్రీంకోర్టు
- విచారణపై వివేకా కుమార్తెకు అసంతృప్తి ఉందన్న సుప్రీం
- ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకున్నామని వ్యాఖ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. తన తండ్రి హత్య కేసు సీబీఐ విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలను జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 19న జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ముగించింది. ఈరోజు తుది తీర్పును వెలువరించింది. కడప కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణపై వివేకా కుమార్తెకు అసంతృప్తి ఉన్నందున కేసు విచారణ బదిలీకి ఆదేశాలిస్తున్నట్టు తెలిపింది. ప్రజల ప్రాథమిక హక్కులను తాము పరిగణనలోకి తీసుకున్నామని చెప్పింది. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమని చెప్పింది.