Heart: గుండె బలహీనపడుతోందని చెప్పే ఐదు సంకేతాలు ఇవే!
- మనిషికి ప్రాణాధారం గుండె
- శరీరానికి రక్తం పంప్ చేసే కీలక అవయవం
- రక్త సరఫరా లోపిస్తే తీవ్ర అనారోగ్యం
- గుండెను పదిలంగా చూసుకోవాలంటున్న వైద్యులు
మానవదేహంలో అత్యంత కీలకమైన అవయవం గుండె. ప్రపంచంలో అత్యధికమంది గుండె వైఫల్యం కారణంగా మరణిస్తుంటారని అనేక నివేదికలు చెబుతున్నాయి. అందుకే వైద్యులు గుండెను పదిలంగా చూసుకోవాలని సూచిస్తుంటారు. శరీరంలోని వివిధ భాగాలకు, కణజాలాలకు రక్తాన్ని సరఫరా చేయడం గుండె ప్రధాన విధి. గుండె బలహీనపడితే, శరీరంలో రక్త సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే, గుండె బలహీనపడుతోందని ఈ ఐదు సంకేతాల ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
1. కొద్ది దూరం నడిచినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సులభంగా అలసిపోతారు. రాత్రివేళల్లో సరిగా ఊపిరి పీల్చుకోలేరు. కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి మూసుకుపోవడం వల్ల ఇలా సంభవిస్తుంది.
2. గుండె కండరాలు పెళుసుగా మారినప్పుడు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. శరీరంలోని అవయవాలకు తగినంతగా రక్తాన్ని సరఫరా చేయలేదు. తల తిరగడం వంటి సమస్యలు ఈ కారణంగానే తలెత్తుతాయి.
3. కొందరిలో తరచుగా గుండె దడదడమని కొట్టుకుంటుంది. హృదయస్పందనలో అస్థిరత కనిపిస్తుంది. దీన్నే వైద్య పరిభాషలో 'పాల్పిటేషన్' అంటారు. ఇది కూడా గుండె బలహీనపడుతోందని చెప్పడానికి ఓ సంకేతమే.
4. గుండె పనితీరు తరచుగా మందగించడం వల్ల శరీర కణజాలాల్లో అదనపు ద్రవాలు పేరుకుపోతాయి. ఈ కారణంగా కాళ్లు, పాదాలు, మడమల వద్ద వాపు కనిపిస్తుంది. దీన్ని 'పెడల్ ఎడెమా' అంటారు.
5. బలహీనమైన గుండె కిడ్నీల్లోకి తగినంత రక్తాన్ని పంపించడంలో విఫలమవుతుంది. తద్వారా మూత్రం రాక ఇబ్బంది పడతారు. డయాలసిస్ కు దారితీసే పరిస్థితి ఇదే. అంతేకాదు, కిడ్నీలు అనారోగ్యం పాలవుతాయి.