Raja Singh: తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయి: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
- రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంలో ప్రేమ్ సింగ్ పిటిషన్
- రాజాసింగ్ కు ఇంకా ఏడాది పదవీకాలం ఉందని వెల్లడి
- 2018లో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిందన్న సుప్రీం
తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అనర్హుడిగా ప్రకటించే అంశంపై నోటీసులు జారీ చేయాలని కోరుతూ టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. రాజాసింగ్ పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఎమ్మెల్యేగా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ లో కోరారు. ఎమ్మెల్యేగా ఆయనకు ఇంకా ఏడాది కాలం ఉందని, అందువల్ల అనర్హత వేటు వేయాలని ప్రేమ్ సింగ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ సందర్భంగా కలగజేసుకున్న సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ జాతకచక్రాల ప్రకారం అన్ని గ్రహాలు కలిసి ఈ కేసును వినాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయని వ్యంగ్యంగా పేర్కొంది. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు... తదుపరి విచారణను వాయిదా వేసింది.