Jeevan Reddy: ఓ ఆడబిడ్డపై ఇలాంటి దాడులా?... షర్మిలపై దాడి పట్ల కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పందన
- వరంగల్ జిల్లాలో షర్మిల వాహనంపై దాడి
- ఇదేం సంస్కృతి అని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ
- పోలీసులు చూస్తూ ఉన్నారని ఆరోపణ
- విమర్శలు చేస్తే దాడులు చేయడం సరికాదని హితవు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల వాహనంపై వరంగల్ జిల్లాలో దాడి జరగడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈ దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు.
ఓ ఆడబిడ్డపై ఈ విధంగా దాడులా? ఇదా సంస్కృతి? అని ప్రశ్నించారు. ఏం... ఓ ఆడబిడ్డ పార్టీ అధ్యక్షురాలిగా ఉండకూడదా? ఆమె యాత్రను అడ్డుకోవడం ఎందుకు? అని జీవన్ రెడ్డి నిలదీశారు. ఒకవేళ ఆమె ఏమైనా విమర్శలు చేసుంటే న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలే కాని, దాడులు చేయడం సరికాదని హితవు పలికారు.
ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అనుమతించకపోవడం ఏంటని అన్నారు. అధికార పక్షం దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం గర్హనీయం అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుని, విగ్రహ పునఃప్రతిష్టాపన చేయాలని డిమాండ్ చేశారు.