Brother Anil Kumar: ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న బ్రదర్ అనిల్ కుమార్
- ప్రగతి భవన్ కు వెళ్లేందుకు షర్మిల యత్నం
- ఎస్ఆర్ నగర్ పీఎస్ కు తరలించిన పోలీసులు
- పాదయాత్ర చేయడం తప్పేమీ కాదన్న బ్రదర్ అనిల్ కుమార్
- నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని కామెంట్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ మధ్యాహ్నం ప్రగతిభవన్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం తెలిసిందే. షర్మిల కారు దిగేందుకు నిరాకరించడంతో పోలీసులు ఆమె కారును ట్రాఫిక్ క్రేన్ కు కట్టి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు లాక్కొచ్చారు.
ఈ నేపథ్యంలో, షర్మిల భర్త, ప్రముఖ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతోందో తెలుసుకుంటానని, లోపలికి వెళ్లనివ్వకపోవడానికి తానేమీ క్రిమినల్ ను కాదని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. లోపాలు ఎత్తిచూపామని, ఎవరు రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇందులో వ్యక్తిగత అజెండా ఏముంటుందని అనిల్ కుమార్ ప్రశ్నించారు. పాదయాత్ర చేయడం తప్పేమీ కాదని, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్పష్టం చేశారు.