Jombie Virus: మంచు పొరల కింద 48,500 ఏళ్ల నాటి 'జాంబీ వైరస్' ను గుర్తించిన శాస్త్రవేత్తలు
- రష్యాలోని సైబీరియా ప్రాంతంలో పరిశోధనలు
- ఘనీభవించిన మంచు కింద 13 వైరస్ జాతులు
- ఇవి అత్యంత ప్రమాదకరమన్న పరిశోధకులు
- ఇవి కలిగించే ముప్పును అంచనా వేయలేమని వెల్లడి
సంవత్సరాల తరబడి ఘనీభవించిన మంచు వాతావరణ మార్పుల కారణంగా కరిగిపోతుండడం మానవాళికి కొత్త సవాలుగా పరిణమిస్తున్న నేపథ్యంలో, శాస్త్రవేత్తలు గడ్డకట్టిన ఓ సరస్సు అడుగు భాగంలో 48,500 ఏళ్ల నాటి రాకాసి వైరస్ ను గుర్తించారు. దాంతో పాటే రెండు డజన్ల కొత్త వైరస్ లను కూడా వెలికితీశారు.
రష్యాలోని సైబీరియా ప్రాంతం సంవత్సరంలో అత్యధిక భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి మంచు పొరల కింద సేకరించిన నమూనాలను యూరప్ పరిశోధకులు పరీక్షించారు. వాటిలో 13 రకాల హానికరమైన సూక్ష్మజీవ జాతులను గుర్తించి, వాటిని వర్గీకరించారు. వీటిని పరిశోధకులు జాంబీ వైరస్ లు (దెయ్యపు వైరస్ లు) గా భావిస్తున్నారు. వేల సంవత్సరాలుగా అవి నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ, వ్యాధి కారక శక్తిని మాత్రం కోల్పోలేదని తెలుసుకున్నారు.
ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వేగంగా మంచు ఖండాలు కరిగిపోతున్నాయని, తద్వారా గతంలో చిక్కుబడిపోయిన మీథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల విడుదలతో వాతావరణ మార్పులను మరింత ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. అయితే దీని ప్రభావం నిద్రాణ స్థితిలో ఉన్న పురాతన వైరస్ లపై ఎలా ఉంటుందన్నది స్పష్టత లేదు.
రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. అత్యంత ఘనీభవించిన ఈ మంచు కరిగిపోతే బయటి వాతావరణంలోకి విడుదలయ్యే ఈ రాకాసి వైరస్ లు జంతువులకు, మానవాళికి పెను సమస్యగా పరిణమిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బాహ్య వాతావరణంలోకి ప్రవేశించాక ఎంతకాలం వ్యాధికారకంగా ఉంటాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో... ఈ వైరస్ లకు, మానవాళికి మధ్య వాహకాలు ఏమిటో అంచనా వేయడం ఇప్పటికీ అసాధ్యంగానే ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఇవి కలిగించే ముప్పును అంచనా వేయలేమని పేర్కొన్నారు.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు కరిగిపోతుందని, ఇక్కడ పారిశ్రామికీకరణ కారణంగా జనావాసాల సంఖ్య పెరుగుతుందని... తద్వారా వేల ఏళ్ల నుంచి ఘనీభవించిన మంచు కింద ఉన్న ఈ దెయ్యపు వైరస్ లు బయటికి వచ్చి ముప్పుగా పరిణమిస్తాయని పరిశోధకులు విశ్లేషించారు.